logo

సర్కారీ జాగా.. వేసెయ్‌పాగా!

సర్కారు భూముల్లో కబ్జాదారులు ఇష్టారాజ్యంగాగ పాగా వేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో దాదాపు ఐదు నెలల్లోనే 33 చోట్ల రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. వీటిని రెవెన్యూ అధికారులు సకాలంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రికార్డుల్లో నమోదు కానివి పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 28 Jan 2022 06:18 IST

5 నెలల్లో రూ.వందల కోట్ల భూమి ఆక్రమణ

ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌, ఫిలింనగర్‌, న్యూస్‌టుడే


దీన్‌దయాళ్‌నగర్‌లో ఆక్రమణలతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆగిన ప్రాంతమిదే

సర్కారు భూముల్లో కబ్జాదారులు ఇష్టారాజ్యంగా పాగా వేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో దాదాపు ఐదు నెలల్లోనే 33 చోట్ల రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. వీటిని రెవెన్యూ అధికారులు సకాలంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రికార్డుల్లో నమోదు కానివి పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రస్తుతం సర్కారు ఆధీనంలో 1,138 ప్రాంతాల్లో 40.37 ఎకరాల భూమి ఉంది. వీటికి సంబంధించి న్యాయస్థానాల్లో 2,493 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఆగిన ఇళ్ల నిర్మాణం..
ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసినా కబ్జాలకు ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే. షేక్‌పేట తహసీల్‌ పరిధిలో చోటుచేసుకున్న ఉదంతమే ఇందుకు నిదర్శనం. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం దీన్‌దయాళ్‌నగర్‌లో ఐదేళ్ల కిందట రెండు ఎకరాల స్థలం కేటాయించింది. వివిధ కారణాలతో అక్కడ పనులు ప్రారంభం కాలేదు. ఇదే అదనుగా భావించిన కొందరు దాదాపు 2000 గజాలకుపైగా ఆక్రమించారు. ఆక్రమణదారులకు రాజకీయ అండదండలు ఉండటంతో గృహనిర్మాణ అధికారులు సైతం చేతులెత్తేశారు. ఏళ్లవుతున్నా ఇళ్ల నిర్మాణం ఆరంభం కాక లబ్ధిదారులకు దిక్కుతోచని పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో షేక్‌పేట తహసీల్‌ పరిధిలోనే ఎక్కువగా భూ ఆక్రమణలు, వివాదాలు తలెత్తుతున్నాయి. గత ఐదు నెలల్లో సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌లో మొత్తం 20 ఆక్రమణలను గుర్తించగా, అందులో 8 షేక్‌పేట పరిధివే.


కఠిన చర్యలు తప్పవు
ఎల్‌.శర్మన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌

ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. బాధ్యులపై క్రిమినల్‌ చర్యలూ తీసుకుంటున్నాం. అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధీనంలోని స్థలాల్ని పర్యవేక్షిస్తున్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్తున్నారు. భూ పరిరక్షణ సెల్‌ ద్వారా భూముల్ని రక్షిస్తున్నాం.


కబ్జాలకు కారణాలివీ
* ప్రభుత్వ స్థలాల చుట్టూ ప్రహరీలు లేకపోవడం

* వీఆర్‌వో వ్యవస్థ రద్దుతో పరిశీలన తక్కువగా ఉంటోంది.

* కొన్నిస్లారు స్థానికులు ఫిర్యాదు చేసేవరకూ దానిపై దృష్టి పెట్టకపోవడం

* కొవిడ్‌తో అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన తగ్గడం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని