logo

అడ్డాకూలీ హత్య కేసులో విద్యార్థులు.. గంజాయి మత్తులో మైనర్ల దారుణం

తల్లిదండ్రులు అడ్డాకూలీలు.. పిల్లల్ని చదివించాలనుకున్నారు. కట్టుతప్పిన ఆ విద్యార్థులు చెడు స్నేహాలతో గంజాయికి బానిసలయ్యారు. చివరకు హంతకులుగా మారారు. కొత్తూరు వైజంక్షన్‌ సమీపంలో అడ్డాకూలీ హత్యకేసును పోలీసులు ఛేదించారు.

Updated : 20 May 2022 02:02 IST

కొత్తూరు, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు అడ్డాకూలీలు.. పిల్లల్ని చదివించాలనుకున్నారు. కట్టుతప్పిన ఆ విద్యార్థులు చెడు స్నేహాలతో గంజాయికి బానిసలయ్యారు. చివరకు హంతకులుగా మారారు. కొత్తూరు వైజంక్షన్‌ సమీపంలో అడ్డాకూలీ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు మైనర్లను అరెస్ట్‌ చేశారు. కొత్తూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏసీపీ కుషాల్కర్‌, ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఉత్తరాది నుంచి 35 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం వచ్చిన కుటుంబాలు శివారు ప్రాంతాల్లో ఉంటున్నాయి. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు. ఒకరు 10వ తరగతి పూర్తిచేసి ఖాళీగా ఉండగా.. మరో విద్యార్థి శంషాబాద్‌లోని కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ ఒకే పాఠశాలలో చదవడంతో స్నేహితులయ్యారు. తల్లిదండ్రుల స్థానికంగా పరిశ్రమలతో పనులకు వెళ్తుండేవారు. పర్యవేక్షణ లేకపోవటంతో మద్యం, గంజాయికి అలవాటు పడ్డారు. ద్విచక్ర వాహనాలు దొంగిలించి వాటిపై తిరుగుతుండేవారు. ఒంటరిగా కనిపించిన వ్యక్తులను బెదిరించి, దాడిచేసి డబ్బులు గుంజుకునేవారు. ఆ సొమ్ముతో జల్సాలు చేస్తుండేవారు. వీరిద్దరిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నెల 9న రాత్రి వారిద్దరూ గంజాయి మత్తులో ద్విచక్రవాహనంపై కొత్తూరు వైజంక్షన్‌ సమీపంలోని అండర్‌పాస్‌ వద్దకు చేరారు. అదే సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన అడ్డాకూలీ దిలీప్‌ బోబ్డే(35) మద్యం మత్తులో వెళ్తున్నాడు. అతడిని గమనించిన మైనర్లు ద్విచక్రవాహనంపై ఎక్కితే ఇంటి వద్ద దించుతామన్నారు. అతడు నిరాకరించటంతో గొడవకు దిగారు. అతను కొట్టడంతో.. బండరాయితో మోది హత్య చేశారు. మృతుడి పర్సులో రూ.11వేలు, గొలుసు తీసుకొని పారిపోయారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పట్టిచ్చిన కొట్టేసిన బైక్‌.. పోలీసులు పలు ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. 10వ తేదీ రాత్రి కొత్తూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఇంటి ముందు ద్విచక్రవాహనాన్ని ఓ బాలుడు చోరీ చేయటాన్ని గుర్తించారు. అతడి గురించి ఆరా తీస్తున్న సమయంలో.. బుధవారం రాత్రి షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ద్విచక్రవాహనం అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా హత్యలో కేసులో నిందితులని తేలింది. వారి వద్ద నుంచి ద్విచక్రవాహనం రూ.3,200 నగదు, గొలుసు, పర్సు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు ఎందరు.? దిలీప్‌ బోబ్డే హత్య కేసులో ఇద్దరు మైనర్లతో పాటూ మరో ఇద్దరు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ హత్య జరిగిన మరుసటిరోజు కొత్తూరు పారిశ్రామిక వాడలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభించింది. ఇది కూడా హత్యేనని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.ఈ హత్యలో నలుగురు ప్రమేయం ఉన్నట్లు అంచనా వేశారు. గురువారం పోలీస్‌ స్టేషన్‌ వద్ద మైనర్ల కుటుంబ సభ్యులు ‘ఇద్దరినే జైలుకు పంపుతున్నారు.. మిగిలిన ఇద్దరినీ ఎందుకు వదిలి పెట్టారంటూ ప్రశ్నించినట్టు సమాచారం. దీనిపై స్పందించిన పోలీసులు రెండు హత్యల్లో వేర్వేరు నిందితులు ఉన్నట్టు గుర్తించామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని