logo

పూజ గదిలో బంగారం వెలికితీస్తామని..

నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ ఎన్‌.చంద్రబాబు, ఎస్సై నాగార్జున్‌రెడ్డి తెలిపిన ప్రకారం కరీంనగర్‌ జిల్లా గన్నేరువరానికి చెందిన

Published : 23 May 2022 02:32 IST

రూ.7 లక్షలు వసూలు చేసిన నకిలీ బాబాలు

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: నకిలీ బాబాలను అరెస్టు చేసిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ ఎన్‌.చంద్రబాబు, ఎస్సై నాగార్జున్‌రెడ్డి తెలిపిన ప్రకారం కరీంనగర్‌ జిల్లా గన్నేరువరానికి చెందిన మతం చందు(30), రాజన్నసిరిసిల్ల జిల్లా తంగలపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్‌ అలియాస్‌ సంజయ్‌(22) బాబాలుగా అవతరమెత్తారు. గత నెల 11న ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో మాచర్ల రాజు(40) వద్దకు వచ్చారు. మీ ఇంటికి తీసుకెళ్లి భోజనం పెడితే అంతా శుభం కలుగుతుందని అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో పూజ గది మూసి ఉండడంతో ఆరా తీశారు. సోదరుడి కుమారుడు చనిపోవడంతో పూజలు చేయడం లేదని రాజు పేర్కొన్నారు. ఇంటిని దెయ్యం ఆక్రమిస్తోందని.. అమావాస్య రోజు పూజలు చేయాలని, లేకపోతే మరో మరణం జరుగుతుందని భయపెట్టి రూ.3వేలు తీసుకొని వెళ్లిపోయారు. భయపడిన ఆయన వారం తర్వాత బాబాలను కలిసి పూజలు చేయాలని కోరారు. అందుకు రూ.35వేలు తీసుకుని పూజలు చేసి వెళ్లి పోయారు. మళ్లీ 10 రోజుల తర్వాత వచ్చి మీ ఇంట్లో పూజ గదిలో రూ.4 కోట్ల విలువ చేసే బంగారం ఉందని నమ్మించారు. అలా వివిధ పూజల పేరిట రూ.7.5లక్షల వారు వసూలు చేశారు. రోజులు గడిచినా.. బంగారం కనిపించకపోవడంతో మోస పోయామని గ్రహించారు. ఈ నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎస్‌వోటీ బృందం సాయంతో ఆదివారం ఇద్దరు నకిలీ బాబాలను పట్టుకున్నారు. రూ.15వేల నగదు, కారు, రెండు చరవాణులు, పూజ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని