logo

అనుభవాలు పదిలం.. అభివృద్ధికి ఆయుధం!

కష్టాలు, అవరోధాలను ఎదుర్కొని తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారీ ధీరవనితలు. చదువు రాకున్నా హస్తకళ ఉత్పత్తులు తయారు చేసి గుర్తింపు పొందుతోంది ఓ మహిళ. స్నాక్స్‌ అందిస్తూ ఆరోగ్యాన్ని పంచాలని అంకుర సంస్థను స్థాపించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది మరో మహిళ.

Published : 25 Jun 2022 02:38 IST

స్ఫూర్తిదాయకంగా మహిళా ఔత్సాహికవేత్తల జీవన గమనం

ఈనాడు, హైదరాబాద్‌: కష్టాలు, అవరోధాలను ఎదుర్కొని తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారీ ధీరవనితలు. చదువు రాకున్నా హస్తకళ ఉత్పత్తులు తయారు చేసి గుర్తింపు పొందుతోంది ఓ మహిళ. స్నాక్స్‌ అందిస్తూ ఆరోగ్యాన్ని పంచాలని అంకుర సంస్థను స్థాపించి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది మరో మహిళ.

రుచికర బ్రేక్‌ ఫాస్ట్‌, స్నాక్స్‌
ఆరోగ్యం పాడవుందని చెబుతున్నా పిల్లలు, పెద్దలు జంక్‌ ఫుడ్‌నే ఇష్టంగా తింటున్నారు. ఇందుకు కారణం ఆరోగ్యకర స్నాక్స్‌ అందుబాటులో లేకపోవడమేనని గుర్తించిన ఫుడ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వయంగా పరిశోధనలు చేసి మిలినోవా ఫుడ్స్‌ అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. సౌమ్య వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్‌ అసోసియేట్‌గా ఆహారం, న్యూట్రిషన్‌, క్వాలిటీ కంట్రోల్‌పై పరిశోధనల్లో పాల్గొన్నారు.  తృణధాన్యాలు, పళ్లు, కూరగాయల కలయికతో ఫార్ములా రూపొందించి స్నాక్స్‌ను తయారు చేశారు. మిల్లెట్‌ పరిశోధన సంస్థ, ఇక్రిశాట్‌, ఐఎస్‌బీ నుంచి గుర్తింపు లభించింది. ఎనర్జీ బార్స్‌ తయారీలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సౌమ్య తెలిపారు. బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటే ప్రొటీన్‌, క్యాల్షియం సమానంగా శరీరానికి అందేలా.. ఒక బార్‌ తయారు చేశారు. శరీరానికి ప్రొటీన్‌, ఫైబర్‌ ఎంత ముఖ్యమో క్యాల్షియం, జింక్‌, ఐరన్‌ సైతం అందాల్సి ఉంటుంది. ఒత్తిడి తగ్గించడంలో ఇవి ఉపయోగపడుతాయి.  

4 భాషలు నేర్చుకొని
12 ఏళ్లకే కవితకు పెళ్లయింది. భర్తతోపాటూ ఉపాధి వెతుక్కుంటూ విజయనగరం నుంచి హైదరాబాద్‌ వచ్చారు. నలుగురు పిల్లల కుటుంబం భర్త ఒక్కరి సంపాదనతో నడవడం కష్టం కావటంతో శిల్పారామంలో ఒక స్టాల్‌లో పనికి చేరారు. చదువురాదు కాబట్టి వచ్చిన కొలువులో చేరారు. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. తెలుగు తప్ప మరే భాష తెలియని దశ నుంచి అక్కడికి వచ్చే వేర్వేరు రాష్ట్రాల వాసులతో మాట్లాడి క్రమంగా తెలుగు, హిందీ, ఆంగ్లం, తమిళం నేర్చుకున్నారు. స్టాల్స్‌ యజమానులు విక్రయించే దుస్తులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడ డిజైన్‌ చేయిస్తున్నారనే విషయాలు తెలుసుకున్న తర్వాత తనే సొంతంగా  కవితా హ్యాండిక్రాఫ్ట్స్‌  స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ముద్ర పథకంలో రుణం తీసుకుని మంగళగిరి, కళంకారి, ఇకత్‌ వస్త్రాలను ఆయా ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. సొంతంగా కొన్ని డిజైన్స్‌ చేస్తున్నారు. చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, జ్యుయలరీ వర్క్‌ చేస్తున్నారు. తాను ఉపాధి పొందడమే కాదు మరో ఇద్దరు దర్జీలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి మహిళా పారిశ్రామికవేత్తగా మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని