logo
Updated : 09 Aug 2022 06:53 IST

చూస్తుండగానే..చూ మంతర్

 ఆనవాళ్లు కనిపించకుండా సైబర్‌ నేరస్థుల హస్తలాఘవం

ఈనాడు, హైదరాబాద్‌

బిట్‌కాయిన్లు.. క్రిప్టో కరెన్సీలను వినియోగిస్తున్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరస్థులు అనూహ్యంగా వారి వాలెట్లలోని రూ.కోట్ల విలువైన బిట్‌ కాయిన్లను కొట్టేస్తున్నారు.. ఇప్పటి వరకూ ఈ తరహా నేరాలు జరగలేదని, ఎలా జరిగిందన్నదీ బాధితులకు అవగాహన లేదని పోలీసులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఒక ప్రవాస భారతీయుడి డిజిటల్‌ వాలెట్ల నుంచి సైబర్‌ నేరస్థులు రూ.2.57 కోట్లు కొట్టేశారు. అంతకుముందు సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ వ్యాపారికి చెందిన రూ.2.20 కోట్ల డిజిటల్‌ కరెన్సీని సైబర్‌ నేరస్థుడు బదిలీ చేసుకున్నాడు. సింగపూర్‌ నుంచి లావాదేవీలు జరగడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అక్కడి సాంకేతిక నిపుణులను సంప్రదిస్తున్నారు.

సెల్‌ఫోన్‌.. ల్యాప్‌టాప్‌ హ్యాకింగా?
సైబర్‌ నేరస్థులు క్రిప్టో కరెన్సీని తమ వ్యాలెట్లలోకి బదిలీ చేసుకునేందుకు సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను హ్యాక్‌ చేశారా? బాధితుల మెయిల్స్‌కు స్పామ్‌ మెయిల్స్‌ పంపించారా? అని పోలీసులు పరిశోధిస్తున్నారు. లండన్‌లో ఉంటున్న ప్రవాస భారతీయుడు తన తల్లిని చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు బిజీగా గడపడంతో నిత్యం క్రిప్టోకరెన్సీ లావాదేవీలను చూసుకోవడం కుదరలేదు. లండన్‌కు వెళ్లేందుకు కొద్దిరోజుల ముందు బిట్‌కాయిన్‌ నిల్వలను చూసుకోగా.. రూ.2.57కోట్లు తక్కువయ్యాయి. ఇదే తరహాలో సికింద్రాబాద్‌లో ఉంటున్న వ్యాపారి లోక్‌జిత్‌ సాయినాథ్‌ను లక్ష్యంగా చేసుకున్న నేరస్థులు.. అతను బిట్‌కాయిన్‌ సహా ఇతర క్రిప్టోకరెన్సీల లావాదేవీలను నిర్వహించే యాప్‌లను తెలుసుకున్నారు. రూ.2.20కోట్లు తమ వ్యాలెట్‌లో బదిలీ చేసుకున్నాక అతడి క్రిప్టోకరెన్సీ లావాదేవీలన్నీ నిలిచిపోయేలా చేశారు. దీంతో సాయినాథ్‌ తన పాస్‌వర్డ్‌ల ద్వారా క్రిప్టోకరెన్సీ లావాదేవీలు నిర్వహించేందుకు ప్రయత్నించినా వీలుకాలేదు. తన ల్యాప్‌టాప్‌ కాకుండా మరో ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌, ఫోన్‌ ఇలా ఇతర మార్గాల్లోనూ ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత సహాయ కేంద్రాలను సంప్రదించినా డిజిటల్‌ కరెన్సీ వెనక్కిరాలేదు.

సందేశాలా?.. యాప్‌లా?..
డెస్క్‌టాప్‌, లాప్‌టాప్‌, చరవాణులను హ్యాక్‌ చేస్తున్న తరహాలోనే క్రిప్టో కరెన్సీనీ బదిలీ చేసుకునేందుకు సైబర్‌ నేరస్థులు ఈ-మెయిల్స్‌కు సందేశాలు పంపించారా? అని పోలీస్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాస భారతీయుడి చరవాణిని పరిశీలించిన పోలీస్‌ అధికారులు సింగపూర్‌ నుంచి క్రిప్టోకరెన్సీ వేర్వేరు ఖాతాలకు బదిలీ అయ్యిందని తెలుసుకున్నారు. బదిలీ చేసిన కంపెనీ ప్రతినిధులను వివరాలను కోరగా... ప్రవాస భారతీయుడి డిజిటల్‌ సంతకాలు, పాస్‌వర్డ్‌లు సరిపోయానని, అందుకే క్రిప్టోకరెన్సీ వేర్వేరు ఖాతాల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో పోలీసులు సింగపూర్‌లోని సాంకేతిక నిపుణులకు విషయాన్ని వివరించి హ్యాకింగ్‌కు సంబంధించిన అంశాలను తెలపాలని అభ్యర్థించారు. దీంతోపాటు ప్రవాస భారతీయుడి క్రిప్టో కరెన్సీని బదిలీ చేసుకున్న నేరస్థులు దాన్ని విక్రయించారా? ఇతర ఖాతాలకు మళ్లించుకున్నారా? అన్న అంశాలపై తమకు సమాచారం ఇవ్వాలంటూ కోరారు.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని