logo

బట్టీ కొలిమిలో.. భవిత మసి..!

చలికాలం వచ్చిందంటే జిల్లాలో ఇటుక బట్టీలు ఊపందుకుంటాయి. స్థానికంగా కూలీలు సరిపోనందున దళారుల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి యజమానులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

Published : 24 Nov 2022 01:50 IST

న్యూస్‌టుడే, పరిగి, కుల్కచర్ల గ్రామీణ  

చలికాలం వచ్చిందంటే జిల్లాలో ఇటుక బట్టీలు ఊపందుకుంటాయి. స్థానికంగా కూలీలు సరిపోనందున దళారుల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకువచ్చి యజమానులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఒక్కో బట్టీ వద్ద కనీసం 5 కుటుంబాలు పిల్లలతో కలిసి నివసిస్తున్నాయి. ఎక్కువగా కొడంగల్‌ నియోజక వర్గంలోని బొంరాస్‌పేట, పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల, దోమ, చౌడాపూర్‌, పరిగి, మండలాల్లో బట్టీలుంటున్నాయి.

పేదరికమే పెద్ద అవరోధం

పేదరికంతో జిల్లాలోని ఇటుక బట్టీలో పనిచేయడానికి ప్రధానంగా ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారితో పాటు గద్వాల ప్రాంతం నుంచి వస్తున్నారు. తమ పిల్లల్ని కూడా తమ వద్దనే ఉంచుకుంటున్నారు. ఒక్కో దానివద్ద కనీసం ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటున్నారు. 5 నుంచి 6 నెలలపాటు వీటి వద్ద పనిచేసే పిల్లలకు నిర్వాహకులు ప్రత్యేకంగా చదువు చెప్పించాల్సి ఉన్నా అవేమీ లేకపోవడంతో చదువూ, సంధ్యలు దూరమై వారి భవిత గాడి తప్పుతోంది. ఒకవేళ స్వచ్ఛంద సంస్థలు పాఠశాలల్లో చేర్పించినా సరిగ్గా చదవలేకపోతున్నారు.

కనిపించకుండా జాగ్రత్తలు

సర్వేలు, ఇతర పరిశీలన సమయాల్లో నిర్వాహకులు, తల్లిదండ్రులు కూడా పిల్లలు కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు. అదేమని అడిగితే పొట్ట పనికోసం ఎల్లలు దాటి వచ్చామని పిల్లలు కళ్లముందే లేకుంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు.

ఆరేళ్లలోపు పిల్లల వరకు ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నా వీరికి అవి అందుబాటులో ఉండటం లేదు. జిల్లాలోని తాండూరు, పరిగి, బొంరాస్‌పేట, కుల్కచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో గతేడాది 241 మంది పిల్లల్ని చైల్డ్‌లైన్‌ నిర్వాహకులు బడికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా కేవలం స్థానికంగా ఉన్న పాఠశాలలకు 51మంది చిన్నారులను పంపించారు. దీంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది.  


ఆయా ప్రదేశాల్లోనే ట్యూషన్లు
- శ్రీనివాస్‌, జిల్లా ఇంఛార్జి, చైల్డ్‌ లైన్‌

ఇటుక బట్టీల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా విద్యా ప్రాధాన్యాన్ని వివరిస్తున్నాం. యజమానులతో చర్చించి పిల్లలకు చదువు నేర్పే విధంగా చూడాలని సూచిస్తున్నాం. వారి ద్వారానే ట్యూషన్లు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. వచ్చే నెలాఖరులోగా సర్వే పూర్తిస్థాయిలో చేపట్టి గుర్తిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని