logo

రాయితీలు లేక.. ఆర్థిక భారం తప్పక..

ఉద్యాన శాఖ రాయితీలు జాడలేకుండా పోయాయి. రెండేళ్లుగా బిందు సేద్యం, తుంపర పరికరాలపై రాయితీ పథకాన్ని అమలు చేయడం లేదు.

Published : 06 Dec 2022 02:21 IST

తుంపర పరికరాలతో వేరుసెనగకు నీరందిస్తూ..

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ: ఉద్యాన శాఖ రాయితీలు జాడలేకుండా పోయాయి. రెండేళ్లుగా బిందు సేద్యం, తుంపర పరికరాలపై రాయితీ పథకాన్ని అమలు చేయడం లేదు. వెరసి రైతులు విపణిలో పూర్తి ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. పంటలను దక్కించుకునేందుకు అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.

30 వేలకు పైగా ఎకరాల్లో...

తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లో రబీ సీజన్‌లో 30వేలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా వేరుసెనగ, ఉల్లి, శనగ, కూరగాయలు పండిస్తున్నారు. వీటికి నీటి తడుల్ని అందించేందుకు రైతులు బిందుసేద్యం, తుంపర పరికరాలను వినియోగిస్తారు. వీటిని ఉద్యాన శాఖ అధికారులు యాభై నుంచి తొంభై శాతం రాయితీతో సమకూర్చే వారు. దీంతో రైతులకు ఎకరాకు రూ.4వేల లోపు ఖర్చయ్యేది. రెండు సంవత్సరాలుగా ఉద్యాన శాఖ రాయితీలను అందించడం లేదు. చేసేది లేక రైతులు తుంపర పరికరాలను బహిరంగ విపణిలో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఎకరాకు రూ.10వేలకుపైగా ఖర్చువుతుండటంతో రైతులపై ఆర్థికభారం పడుతోంది.

* బోరు బావుల్లోని నీటిని సాగుకు సద్వినియోగం చేసేందుకు, నీటి వృథాను అరికట్టేందుకు తుంపర పరికరాలను వినియోగించే రైతులకు రాయితీ అందకపోవడంతో అప్పులు చేసి పరికరాలను సమకూర్చుకుంటున్నారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండటంతో రైతుల ఆదాయంపై ప్రభావం పడుతోంది. ఉద్యాన శాఖ అధికారులు రాయితీలపై బిందు, తుంపర పరికరాలు, గొట్టాలను పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.


ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: మల్లికార్జున్‌, ఉద్యాన శాఖ అధికారి, తాండూరు

రైతులు పంటలకు అవసరం మేరకు నీరందించే వీలుగా తుంపర, బిందు సేద్యం సామగ్రిని రాయితీపై అందించాం. ఏడాది నుంచి బడ్జెట్‌ లేనందున రాయితీపై పంపిణీ చేయడం లేదు. బడ్జెట్‌ కేటాయించాలని ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని