logo

స్నేహితులతో కలిసి బావను హత్య చేసిన బావమరిది

కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో జనవరి 31 అర్ధరాత్రి ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌, సీఐ కిషన్‌కుమార్‌, ఎస్సై వెంకటేశ్వర్లుతో కలిసి శుక్రవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు.

Published : 04 Feb 2023 03:17 IST

వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ చంద్రశేఖర్‌, సీఐ కిషన్‌కుమార్‌

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో జనవరి 31 అర్ధరాత్రి ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్‌, సీఐ కిషన్‌కుమార్‌, ఎస్సై వెంకటేశ్వర్లుతో కలిసి శుక్రవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌కు చెందిన అబ్ధుల్‌ అన్వర్‌(27)కు హఫీజ్‌పేటకు చెందిన షిరీన్‌ బేగంతో 2019లో వివాహమైంది. షిరీన్‌ సోదరుడు సయ్యద్‌ అహ్మద్‌కు మహమూద్‌ అఖీల్‌ స్రేహితుడు. ఇతని వద్ద అన్వర్‌ ఆటో అద్దెకు తీసుకుని నడిపిస్తున్నాడు. ఆటో అద్దెతో పాటు తీసుకున్న అప్పు చెల్లించడంలో జాప్యంచేస్తున్నాడు. దీంతో అఖీల్‌ నిత్యం సయ్యద్‌ ఇంటికి వస్తూ అప్పు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాడు. జనవరి 30న సయ్యద్‌ తన తల్లి, సోదరితో కలిసి కోహిర్‌కు వెళ్లాడు. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి 31న అన్వర్‌ను ఇక్కడికి తీసుకొచ్చారు. అఖీల్‌ను పిలిపించడంతో అప్పు ప్రస్తావన విషయమై అన్వర్‌ నుంచి సరైన స్పందన లేదు. డబ్బు ఉన్నప్పుడు చెల్లిస్తానన్నాడు. తన బావ మద్యానికి బానిసవడం, సోదరిని సరిగా చూసుకోకుండా స్థానికంగా తమ కుటుంబ పరువు తీస్తున్నాడని కక్ష పెంచుకున్న సయ్యద్‌ అతడిని అంతం చేయాలని పథకం పన్నాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో సయ్యద్‌, అఖీల్‌, అన్వర్‌ కలిసి ఆటోలో వెళ్తూ హఫీజ్‌పేటలో మద్యం కోనుగోలు చేశారు. వీరితో సయ్యద్‌ స్నేహితుడు ఇమ్రాన్‌ జతకట్టాడు. మార్గమధ్యంలో అమీర్‌ను ఆటోలో ఎక్కించుకున్నారు. రాత్రి 12 సమయంలో హఫీజ్‌పేట మార్గంలో కేపీహెచ్‌బీ నాలుగోఫేజ్‌-అంబేడ్కర్‌ నగర్‌ మార్గం వద్దకు రాగానే ఆ ప్రదేశం నిర్మానుష్యంగా ఉండటంతో హత్యకు సరైన ప్రదేశమని ఆటో ఆపారు. అహ్మద్‌(25), అఖీల్‌(22), ఇమ్రాన్‌(22), అన్వర్‌ కిందకు దిగారు. వెంటనే అహ్మద్‌ మద్యం సీసాతో అన్వర్‌ తలపై కొట్టారు. ఇమ్రాన్‌ టైల్స్‌ ముక్కలతో పొడుస్తుండగా అమీర్‌ అడ్డుకొనే క్రమంలో అతణ్ని బెదిరించారు. అన్వర్‌  తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు ఛేదనలో కానిస్టేబుళ్లు ఆనంద్‌, సురేష్‌ కీలకంగా వ్యవరించారని ఏసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని