logo

వైద్యుల హాజరుపై నజర్‌

ప్రభుత్వ వైద్యులతో ఇటీవల ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఓ డాక్టరు తరచూ విధులకు ఆలస్యంగా వచ్చి ఒంటిగంటకే వెళ్లిపోతున్న విషయమై చర్చకు వచ్చింది.

Published : 05 Feb 2023 03:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్యులతో ఇటీవల ఉన్నతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఓ డాక్టరు తరచూ విధులకు ఆలస్యంగా వచ్చి ఒంటిగంటకే వెళ్లిపోతున్న విషయమై చర్చకు వచ్చింది. సదరు వైద్యుడు దీనిని ఖండించే ప్రయత్నం చేశారు. ఆయన రాకపోకల ఫొటోలతో సహా బయట పెట్టడంతో ఆ వైద్యుడు సమాధానం చెప్పలేక మౌనం దాల్చారు. దీంతో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది. ఇది ఉదాహరణ మాత్రమే. గాంధీ, ఉస్మానియా, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు వైద్యులు నిత్యం విధులకు ఆలస్యంగా రావడంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. కొందరు వైద్యులైతే ఓపీలకూ ఆలస్యంగా వస్తున్నారు. సాయంత్రం 5 వరకు ఉండకుండా వెళ్లిపోతున్నారు. కొన్నిచోట్ల బయోమెట్రిక్‌ అమల్లో ఉన్నప్పటికీ లెక్క చేయడం లేదు. ‘ఉస్మానియా’లో నెలక్రితం యూరాలజీ విభాగానికి చెందిన ఇద్దరు వైద్యులు పొద్దున బయోమెట్రిక్‌ వేసి వెళ్లిపోయి మళ్లీ సాయంత్రం వచ్చి బయోమెట్రిక్‌ వేశారు. వాస్తవానికి వారు ఆసుపత్రిలో విధుల్లో లేనప్పటికీ సాంకేతికంగా హాజరు పడుతోంది. నిఘా పెట్టడంతో ఈ విషయం బయటపడింది. వారిని వేరే జిల్లాలకు బదిలీ చేశారు.  

ప్రైవేటు ప్రాక్టీసు యావలో పడి..

ఆసుపత్రుల్లో విధులు ముగిసిన తర్వాత ప్రాక్టీసు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ కొందరు వైద్యులు విధులకు డుమ్మా కొట్టి మరీ ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంల బాట పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. రోగులకు మాత్రం ఉపయోగపడటం లేదు. గాంధీ, ఉస్మానియాల్లో ఉదయం 8-9 గంటలకే ఓపీ సేవలు ప్రారంభమవుతున్నా 11 దాటినా వైద్యులు రావడం లేదు. తాము వచ్చేవరకు సహాయ వైద్యులను ఉంచుతున్నారు. ఉదయం ప్రైవేటు ప్రాక్టీసు ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి వారి వివరాలను ఫొటోలతో సహా సేకరించిన ఉన్నతాధికారులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని