logo

దారికాచిన మృత్యువు

హైదరాబాద్‌ నగరంలో వేర్వేరు ఘటనల్లో మంగళవారం ముగ్గురు దుర్మరణం చెందారు. సిలిండర్‌ తగిలి ఒకరు..గుడికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృత్యువాతపడ్డారు.

Published : 08 Feb 2023 02:40 IST

నగరంలో  వేర్వేరు ఘటనల్లో ముగ్గురి దుర్మరణం

చర్లపల్లి, కాప్రా, పహాడీషరీఫ్‌ న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరంలో వేర్వేరు ఘటనల్లో మంగళవారం ముగ్గురు దుర్మరణం చెందారు. సిలిండర్‌ తగిలి ఒకరు..గుడికి వెళ్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...

ప్రకాశ్‌

* సిలిండర్‌ తాకి..: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుడివాడకు చెందిన ప్రకాశ్‌(48) 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కొచ్చి చర్లపల్లి పరిశ్రమలోని సౌత్‌వైర్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ బీఎన్‌రెడ్డినగర్‌లో సూర్య ఇంజినీరింగ్‌ పరిశ్రమకు ఆక్సిజన్‌ సిలిండర్లు దింపుతుండగా.. ఆటోలోని ఓ సిలిండరు కిందపడింది. ఈ క్రమంలో దానికున్న నాజిల్‌ ఊడి సిలిండరు గాలిలోకి దూసుకెళ్లింది. అటుగా ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రకాశ్‌కి తగలడంతో క్షణాల వ్యవధిలోనే పాణాలొదిలాడు. విషయం తెలుసుకున్న భార్య జ్యోతి, కవల పిల్లలు కార్తిక్‌, కీర్తన్‌ బోరుమన్నారు.  మా భవిష్యత్తుకు ఉన్నత కలలు కని.. బీఎస్సీ, బీఫార్మసీ చదువుతున్న ఇద్దరు కుమారులు రోదన పలువురిని కలిచివేసింది.

వీణ, శ్రీధరాచారి

* గుడికెళ్తూ.. దైవ దర్శనానికి బయలుదేరిన మహిళ, మరోకరు ద్విచక్రవాహనం అదుపుతప్పి అక్కడికక్కడే దుర్మరణం చెందిరు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌ మైత్రినగర్‌కు చెందిన దినేష్‌ భార్య వీణ(35) కార్వాన్‌లో ఆశా కార్యకర్త.  మంగళవారం తెల్లవారుజామున రావిరాలలోని ఎల్లమ్మ ఆలయానికి ఆమె స్కూటీపై బయలుదేరింది. అదే వీధిలో ఉండే లారీ బాడీ మెకానిక్‌ కాసోజు శ్రీధరాచారి(35) తానూ అక్కడికే వెళ్తున్నట్లు చెప్పడంతో తన స్కూటీపై లిఫ్ట్‌ ఇచ్చింది. బాలాపూర్‌ ఆర్‌సీఐ రోడ్డు మీదుగా వేగంగా వెళ్తుండగా ‘మంచి’ స్కూల్‌ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న దిమ్మె గోడను ఢీకొంది. దీంతో ఇద్దరూ ఎగిరి రహదారిపై పడ్డారు. తలలకు తీవ్ర గాయాలవడంతో మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని