logo

తనిఖీలే కాదు.. అవగాహన

నగరంలో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, గోదాంలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం సరిగా స్పందించడం లేదు.

Published : 19 Mar 2023 02:54 IST

వాణిజ్య సముదాయాలు, సంస్థల జోలికి వెళ్లని అధికారులు

ప్రమాదం జరిగిన స్వప్నలోక్‌ భవనం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, గోదాంలలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం సరిగా స్పందించడం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి లోపాలపై ఒకటి, రెండు రోజులు హడావుడి చేయడం తప్ప.. జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, పోలీస్‌, విద్యుత్తు శాఖ అధికారులు ఎవరూ బహుళ అంతస్తుల భవనాల్లో భద్రత పరిశీలించడం లేదు. తనిఖీలు చేయడం లేదు. ఇంతే కాదు... కంపెనీలు, కార్యాలయాలు, దుకాణాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి అనూహ్యంగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఎలా రక్షించుకోవాలన్న అంశాలపై అవగాహన కల్పించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరుగుతోంది.

మార్పులు.. చేర్పులు..

వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పూర్తయ్యాక జీహెచ్‌ఎంసీ అధికారులు నివాసయోగ్య పత్రం ఇస్తున్నారు. అనంతరం భవనాల యజమానులు, దుకాణాలు, కంపెనీల యజమానులు ఆధునికీకరణ పేరుతో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. ఎక్కువగా ఐటీ సంస్థలు, ప్రైవేటు సంస్థల్లో అద్దాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ్య విశాలమైన గదులను గోప్యత, భద్రత పేరుతో చిన్న గదులుగా మార్చి వాటికి అద్దాలు, ఖరీదైన కలప తలుపులు బిగిస్తున్నారు. మార్పులు, చేర్పులను జీహెచ్‌ఎంసీ అధికారులు, అగ్నిమాపకశాఖ అధికారులు పరిశీలించడం లేదు. ్య అగ్నిమాపక శాఖ అధికారులు రెండేళ్ల నుంచి ‘వార్షిక నిర్వహణ పత్రం’ పేరుతో భవనాలు, వాణిజ్య సముదాయాలు, గేటెడ్‌ కమ్యూనిటీల నుంచి అగ్నిమాపక భద్రత పత్రాలను తీసుకుంటున్నారు. వాటిలో ఉన్నదే చూస్తున్నారు తప్ప.. అక్కడికి వెళ్లి పరిశీలించడం లేదు. నీళ్లపైపు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్స్‌, ఇసుక, తప్పనిసరి. అయినా చాలా భవనాల్లో ఎక్కడా కనిపించవు.

ఆపద వేళ ఏం చేయాలో తెలీక..

అగ్నిప్రమాదం జరిగితే మంటలను ఎలా ఆర్పాలి, ఎవరికి సమాచారం ఇవ్వాలి? అందుబాటులో నీళ్లుంటే ఎలా వినియోగించాలి? విద్యుత్తు సరఫరా ఎప్పుడు నిలిపేయాలి? గ్యాస్‌ సిలిండర్లుంటే ఏం చేయాలన్న అంశాలపై దుకాణాలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి అగ్నిమాపక శాఖ అవగాహన కల్పించాలి. లిఫ్టులు ఉపయోగించకుండా ప్రత్యామ్నాయాలు ఎలా ఎంచుకోవాలి? అనేది ప్రయోగాత్మకంగా వివరించాలి. ఈ విషయం తెలియకనే స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు.

బాధిత కుటుంబాలకే శిక్ష.. కారకులకేది?

ఈనాడు, హైదరాబాద్‌: వందల కిలోమీటర్ల నుంచి పొట్టకూటికి వచ్చిన బిహార్‌ కూలీలు.. అర్ధరాత్రి హాహాకారాలు చేస్తూ బూడిదగా మారారు. కుటుంబం కోసం కాయకష్టం చేసుకుందామని దుకాణంలో కార్మికులుగా చేరిన ముగ్గురు గుజరాతీయులు ఆనవాళ్లు లేకుండా పోయారు. తాజాగా కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన ఆరుగురు యువతీ యువకులు ఆకస్మిక అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్‌ పరిధిలో జరిగిన ఈ ప్రమాదాల్లో ప్రాణాలొదిలిన పేద బతుకులు.. యజమానుల ఉదాసీనత, అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి ఉదాహరణలు. సికింద్రాబాద్‌ డెక్కన్‌ మాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం తర్వాత అగ్నిమాపక శాఖ వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు చేపట్టింది. కొద్దిరోజుల సోదాల్లోనే 1800 వాణిజ్య సముదాయాలు, రసాయన, వ్యర్థాలు నిల్వచేసే గోదాముల్లో కనీస అగ్ని నివారణ సౌకర్యాలు లేవంటూ నిర్ధారించి.. నోటీసులిచ్చింది.

హెచ్చరికలతోనే సరి..

ఏటేటా పెరుగుతున్న అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణనష్టం పెరుగుతోంది. ఏదైనా ప్రమాదం జరగ్గానే ఆగమేఘాలపై అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. యజమానులు త్రుణమో.. ఫణమో బాధితులకు సాయం అందించినట్టు నటించి కేసుల నుంచి బయటపడుతున్నారు. అగ్నిమాపకశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసుల సమన్వయ లోపం సామాన్యుల ప్రాణాల మీదకు తెస్తోంది. అగ్నిప్రమాదానికి భవన యజమానులు, వ్యాపారులే కారణమంటూ నివేదికల్లో నిగ్గు తేల్చినా.. ఏ ఒక్కరికీ శిక్షలు పడిన దాఖలాల్లేవు. మరోవైపు తమవారికి కోల్పోయిన కుటుంబాలు భారంగా బతుకీడుస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని