logo

చిన్నారిని చిదిమేసిన చెత్త సేకరణ ఆటో

శుభకార్యం జరుగుతున్న ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. కుమార్తె 21వ రోజు వేడుకలు జరుపుకోవాల్సిన తల్లిదండ్రులు కుమారుడు దూరమై కన్నీటి సంద్రంలో మునిగారు.

Published : 28 Mar 2023 03:25 IST

రజాక్‌

గౌతంనగర్‌, న్యూస్‌టుడే: శుభకార్యం జరుగుతున్న ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి. కుమార్తె 21వ రోజు వేడుకలు జరుపుకోవాల్సిన తల్లిదండ్రులు కుమారుడు దూరమై కన్నీటి సంద్రంలో మునిగారు. ఈ దుర్ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలో సోమవారం జరిగింది. ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన అభం, శుభం తెలియని చిన్నారి చెత్త సేకరణ ఆటో కింద పడి దుర్మరణం పాలయ్యాడు. సెక్టార్‌ ఎస్సై హరిప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం మౌలాలి డివిజన్‌ భరత్‌నగర్‌ సమీపంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్‌ జీషన్‌ ఆటో డ్రైవర్‌. అతని కుమారుడు మహ్మద్‌ రజాక్‌ అహ్మద్‌ ఖాద్రీ (16 నెలలు) సోమవారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటూ చెత్త సేకరణ ఆటో వెనక్కి వెళ్లాడు. అదే సమయంలో ఆటో డ్రైవర్‌ చూసుకోకుండా బండిని వెనక్కు తీయడంతో వెనక చక్రాల కింద పడి నలిగిపోయిన చిన్నారి స్పృహ కోల్పోయాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఆటో తగిలి పడిపోతున్న బాలుడు, చిన్నారిపైకి ఎక్కిన టైరు

పడిపోయిన రజాక్‌ను ఎత్తుకుంటున్న ఆటోడ్రైవర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని