logo

కొరవడిన ఆత్మ విశ్వాసం!

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నదాతల్లో మార్పు రావాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నా అందుకు తగిన విధంగా వారికి ప్రోత్సాహం లభించడం లేదు.

Published : 01 Apr 2023 03:02 IST

విజ్ఞాన యాత్రలు, సాంకేతికతకు దూరంగా రైతులు
న్యూస్‌టుడే: పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌

నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌లో సాగు చేసిన పసుపు పంటను పరిశీలిస్తున్న ఖుదావంద్‌పూర్‌ రైతులు

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నదాతల్లో మార్పు రావాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెబుతున్నా అందుకు తగిన విధంగా వారికి ప్రోత్సాహం లభించడం లేదు. దీంతో దాదాపు రైతులందరూ పాత పద్ధతుల్లోనూ పంటలు సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను చైతన్య పరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం, రైతువేదికల నిర్మాణం, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటివి ఏర్పాటు చేస్తోంది. సాగు సమయంలోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అందించడం, ఇతర ప్రాంతాల్లో మేలైన రకాల వంగడాల సాగు, ప్రత్యామ్నాయ పద్ధతులు వంటి వాటిని చూసేందుకు విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్లి ఆదిశగా వారిని మళ్లించడం తదితర రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సాగు భూమి 8.96లక్షల ఎకరాలు

జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 8.96లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉండగా అందులో సాగుకు ఆమోదయోగ్యమైంది 6,81,730 ఎకరాలు. ఇందులో ఖరీఫ్‌లో 6లక్షలకు పైగా రబీలో 1.20 లక్షల ఎకరాల వరకు వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. 2018-19 వరకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి. ఇతర ప్రాంతాలు, జిల్లాలు, రాష్ట్రాల్లోనూ సాగవుతున్న పంటలను చూసేందుకు రైతులను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన యాత్రలకు తీసుకువెళ్లేది. గడిచిన మూడు, నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో ఏటా కనీసం ఒకటి కూడా నిర్వహించడం లేదు. అధిక దిగుబడుల సాధనకు రైతుల మధ్య ఎరువుల వినియోగం పోటీ పెరిగి అనారోగ్యకరమైన వాతావరణానికి దారితీస్తోంది. దీనిని పునరుద్ధరిస్తే కొంత ప్రయోజనం ఉంటుంది.

శిక్షణ భవనం ఉన్నా..: నాలుగేళ్ల క్రితం నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఒక్కో భవనానికి రూ.60లక్షలను వెచ్చించి నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఎటువంటి కార్యక్రమాలు లేకపోవడంతో అవి కేవలం జిల్లా స్థాయి అధికారులకు సమావేశాల నిర్వహణకు ఉపయోగపడుతున్నాయి. పరిగిలోని భవనంలో పశువైద్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమలైన పట్టు, మత్స్య, ఉద్యానం, పాడి పరిశ్రమ తదితర రంగాలపై అవగాహన కల్పిస్తే కొంతైనా ప్రయోజనం కలుగుతుంది.

స్వతహాగా క్షేత్ర సందర్శనలు

కొన్నిచోట్ల రైతులు తమ సొంత ఖర్చులతో ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి సాగు పరిస్థితులను చూస్తున్నారు. ఆర్థికంగా లేనివారు వెళ్లలేకపోతున్నారు. పరిగి మండలం ఖుదావంద్‌పూర్‌, కాళ్లాపూర్‌ గ్రామాలకు చెందిన రైతులు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లో బిందు పద్ధతిన సాగు చేస్తున్న పసుపు పంటను పరిశీలించి వచ్చారు.


స్థానికంగానే అవగాహన కల్పిస్తున్నాం

గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

ప్రస్తుతం రైతు వేదికలను వినియోగించుకుంటున్నాం. అక్కడే రైతులకు అధిక దిగుబడులపై అవగాహన కల్పిస్తున్నాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే విధంగా సలహాలు, సూచనలు ఇస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని