logo

Dimple Hayathi: డింపుల్‌ను డీసీపీ వేధించాలనుకున్నారు: నటి తరఫు న్యాయవాది

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై కేసు నమోదు కావడం గురించి నటి డింపుల్‌ హయాతి (Dimple Hayathi) స్పందించారు. అలాగే ఆమె తరఫు న్యాయవాది సైతం మీడియాతో మాట్లాడారు.

Updated : 23 May 2023 17:37 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు కావడం గురించి నటి డింపుల్‌ హయాతి (Dimple Hayathi) స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకెంతో అండగా నిలుస్తోన్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ‘‘ప్రస్తుతం జరుగుతోన్న వ్యవహారంలో అభిమానులు నాపై చూపిస్తోన్న ప్రేమకు నేను కృతజ్ఞురాలిని. ఇలాంటి పరిస్థితుల్లో నాకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. అయితే ఈ విషయం గురించి నేను ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దయచేసి సహనంతో ఉండాలని కోరుకుంటున్నా. నా లీగల్‌ టీమ్‌ త్వరలోనే దీనికి బదులివ్వనుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

మరోవైపు, డింపుల్‌ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ తాజాగా మీడియాతో మాట్లాడారు. ‘‘డింపుల్ హయాతిపై తప్పుడు కేసు పెట్టారు. రోడ్డు మీద ఉండాల్సిన సిమెంట్ బ్రిక్స్ అపార్ట్‌మెంట్‌లోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నాం. డింపుల్‌తో డీసీపీ చాలాసార్లు అమర్యాదగా మాట్లాడారు. అలాగే, ఆమె పార్కింగ్ స్థలంలో కోన్స్ పెట్టారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారు. దానివల్లే ఆ కోన్స్‌ను కాలితో తన్నారు. ఆ సమయంలోనే డీసీపీపై కేసు పెడతానని డింపుల్‌ అన్నారు. అందుకే ఆమెపైనే కేసు పెట్టారు. డీసీపీ ఆమెను వేధించాలనుకుంటున్నారు. ఆయన తన క్వార్టర్స్‌లో ఉండకుండా ఈ అపార్ట్‌మెంట్‌లో ఎందుకు ఉన్నారు? ఆయన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న ఆయనపై ఫిర్యాదు చేయడానికి డింపుల్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. కానీ అక్కడ ఎవరూ ఆమె ఫిర్యాదు స్వీకరించలేదు. మూడు గంటలపాటు అక్కడే కూర్చొబెట్టారు. మేము దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం’’ అని అన్నారు.

జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో డీసీపీ రాహుల్‌ హెగ్డే ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్‌ హయాతి, డేవిడ్‌ కూడా నివసిస్తున్నారు. సెల్లార్‌లో ఉన్న పార్కింగ్‌ ప్లేస్‌లో హెగ్డే అధికారిక వాహనాన్ని నటి డింపుల్‌ హయాతి ధ్వంసం చేసినట్లు, డీసీపీ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డింపుల్‌ హయాతి, డేవిడ్‌పై జూబ్లీహిల్స్‌ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. 41 సీఆర్‌పీసీ కింద పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. మరోవైపు దీనిపై డింపుల్‌ హయాతి ట్వీట్‌ చేసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తప్పును కప్పిపుచ్చుతున్నట్లు పరోక్షంగా డీసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని