logo

పాఠశాలల బలోపేతమే లక్ష్యం

విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉందో, తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ముఖ్యం. అందుకనే విద్యా శాఖ అధికారులు తల్లిదండ్రులతో ‘పాఠశాల యాజమాన్య కమిటీలను’ ఏర్పాటుచేస్తూ వాటి బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.

Published : 26 May 2023 02:51 IST

యాజమాన్య కమిటీల గడువు పొడిగింపు

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యాకమిటీ సభ్యులు

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, కొడంగల్‌ గ్రామీణం: విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉందో, తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ముఖ్యం. అందుకనే విద్యా శాఖ అధికారులు తల్లిదండ్రులతో ‘పాఠశాల యాజమాన్య కమిటీలను’ ఏర్పాటుచేస్తూ వాటి బలోపేతానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారినీ భాగస్వాములను చేస్తూ ప్రతి ఏడాది మార్పులు తీసుకొచ్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ నెల 31తో గడువు ముగియనున్న ‘పాఠశాల యాజమాన్య కమిటీల పదవీకాలాన్ని’ మరోసారి పొడిగించారు.

కరోనా నుంచి కొనసాగింపు

కొత్త కమిటీలకు 2019 నవంబరు 30న ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికైన కమిటీల సభ్యులు రెండేళ్లు బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో కరోనా ప్రభావంతో రెండేళ్లు పాఠశాలల పనితీరు గాడి తప్పింది. పాఠశాల నిర్వహణపై పూర్తిస్థాయిలో కమిటీలకు అవగాహన లేకుండానే పదవీకాలం ముగియడంతో గడువును పెంచుకుంటూ వస్తున్నారు. ‘మన ఊరు- మన బడి’ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది నవంబరు 30 వరకు ఆరు నెలలు గడువు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.

వీరిదే కీలక పాత్ర  

రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆదేశాలతో ప్రతి కార్యక్రమం అమలు చేయించాల్సిన బాధ్యత కమిటీలపైనే ఉంది. విద్యాశాఖ అధికారులు తలపెట్టే ప్రతి కార్యక్రమం పాఠశాల స్థాయిలో విజయవంతంగా కొనసాగాలంటే కమిటీలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.  

* ప్రతి నెల సమావేశాలు నిర్వహించి పాఠశాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళిక రూపొందించి అమలుకు సహకరించాలి. బడిఈడు పిల్లలందరూ విధిగా పాఠశాలలో చేరేలా చూడాలి. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి. విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు విధానాన్ని పరిశీలించాలి. ప్రభుత్వం నుంచి అందించే నిధులు సక్రమంగా ఖర్చుపెట్టే విధంగా పర్యవేక్షణ చేయాలి. గ్రామాల్లోని దాతలు, ప్రజాప్రతినిధుల నుంచి నిధులు సేకరించి విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలి. తరచూ పాఠశాలలకు డుమ్మా కొట్టే విద్యార్థుల వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి నిత్యం పాఠశాలకొచ్చే విధంగా చూడాలి.


ఆదేశాలు వచ్చాయి
రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి

పాఠశాల యాజమాన్య కమిటీల పదవీ కాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడున్న కమిటీలే నవంబరు 30వరకు కొనసాగుతాయి. ఆయా పాఠశాలల్లోని అభివృద్ధి పనులు కమిటీల తీర్మానాలతోనే కొనసాగుతాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని