logo

తెలంగాణ సంస్కృతి చాటేలా ఆషాఢ బోనాలు: తలసాని

తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పేలా ఆషాఢ బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Updated : 27 May 2023 02:58 IST

సోమాజిగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పేలా ఆషాఢ బోనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. జూన్‌ 22 నుంచి ప్రారంభం కానున్న బోనాల ఏర్పాట్లపై శుక్రవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించిందని చెప్పారు. 22న గోల్కొండలో, జులై 9న సికింద్రాబాద్‌ మహంకాళి, 16న పాతబస్తీలో బోనాలు ప్రారంభమవుతాయి. ఏర్పాట్ల కోసం దాదాపు రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఊరేగింపు నిర్వహించే, ఆలయాలకు వెళ్లే రహదారులలో అవసరమైన మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. గోల్కొండ జగదాంబిక ఆలయంలో, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ అక్కన్న మాదన్న తదితర 26 దేవాలయాలకు రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు వివరించారు. మహంకాళి, అక్కన్న మాదన్న, సబ్జిమండీ ఆలయాలకు అంబారీ ఊరేగింపు కోసం ఏనుగును ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. సమావేశంలో మంత్రులు.. ఇంద్రకరణ్‌రెడ్డి, మల్లారెడ్డి, మేయర్‌ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఎమ్మెల్సీలు.. ప్రభాకర్‌రావు, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, ఆరికెపూడి గాంధీ, జలమండలి ఎండీ దానకిషోర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, హైదరాబాద్‌, రాచకొండ సీపీలు.. సీవీ ఆనంద్‌, చౌహాన్‌, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని