logo

ఔషధ నగరి.. అలా నిలిచి

రాజధాని నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో యాచారం, కందుకూరు మండలాల్లో రాష్ట్ర సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఔషధ నగరి(ఫార్మా సిటీ) నిర్మాణం మధ్యలో అలా నిలిచిపోయింది.

Published : 07 Jun 2023 04:11 IST

గ్రీన్‌ ఫార్మాసిటీ ఠాణా ఏర్పాటుతో కదలిక
అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న రైతులు.. గ్రామస్థులు

ఫార్మాసిటీ నమూనా చిత్రం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, యాచారం, కందుకూరు: రాజధాని నగరానికి నలభై కిలోమీటర్ల దూరంలో యాచారం, కందుకూరు మండలాల్లో రాష్ట్ర సర్కార్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఔషధ నగరి(ఫార్మా సిటీ) నిర్మాణం మధ్యలో అలా నిలిచిపోయింది. బలవంతంగా భూములు సేకరించారంటూ ఫార్మాసిటీ పరిధిలోని కొందరు గ్రామస్థులు, రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించడం.. నిర్మాణాలపై న్యాయస్థానం స్టే విధించడంతో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. మూడు రోజుల క్రితం గ్రీన్‌ ఫార్మాసిటీ ఠాణా ప్రారంభంతో ఫార్మాసిటీ కార్యకలాపాలపై కదలికలు వచ్చాయి. ఔషధనగరి కోసం సేకరించిన భూముల్లోనే ఠాణా నిర్మించనున్నామని పోలీసులు ప్రకటించడంతో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ సరస్వతి, అక్కడి రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మూడు దశల్లో నిర్మించాలని..

ఔషధాల తయారీలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం మరిన్ని ఫార్మాసంస్థలు ఇక్కడే కార్యకలాపాలు కొనసాగించాలన్న లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం ఔషధనగరిని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. హైదరాబాద్‌కు సమీపంలోని యాచారం, కందుకూరు మండలాల్లో 19వేల ఎకరాల భూమి సేకరించి మూడు దశల్లో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వ భూములు, లావణిపట్టాలు, ఇతర భూములు కలిపి 6,400 ఎకరాలను రెవెన్యూ అధికారులు సేకరించారు. అనంతరం అసైన్డ్‌ భూములు, రైతుల నుంచి 10వేల ఎకరాల భూములను సేకరించారు. యాచారం మండలంలోని కుర్మిగడ్డ, మేడిపల్లి, నానక్‌నగర్‌, తాడిపర్తి గ్రామాలకు చెందిన కొందరు రైతులు భూ సేకరణను వ్యతిరేకించారు. పరిహారం తక్కువగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసి కోర్టులను ఆశ్రయించారు. మొత్తం 32 ఫిర్యాదులు కోర్టుల్లో ఉండగా.. రెండు నెలల క్రితం ఇందులో 24 కేసుల్లో తుది విచారణ పూర్తయ్యింది. ఒకటి, రెండు నెలల్లో మిగిలిన ఫిర్యాదుల విచారణ కూడా పూర్తికానుంది.  

ఉత్తర్వుల ధిక్కరణే అంటూ..

ఫార్మా సిటీలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా కోర్టుల ఉత్తర్వులున్నా.. ఠాణా పేరుతో దొడ్డిదారిన పనులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ కన్వీనర్‌ సరస్వతి తెలిపారు. ఠాణానుసేకరించిన భూముల్లో ఏర్పాటు చేయడం కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని అధికారులు ఆలోచించుకోవాలన్నారు.


ఔషధనగరి ప్రాజెక్టు స్వరూపం

ప్రతిపాదిత ప్రాంతం: 19,333 ఎకరాలు
తొలిదశలో నిర్మాణాలు... 8400 ఎకరాలు
పెట్టుబడులు:రూ.64వేల కోట్లు
ప్రత్యక్ష, పరోక్ష  ఉద్యోగాలు:5.6లక్షలు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని