logo

సౌకర్యాల మెరుగుకు ప్రకటనలేవీ!

వార్షిక తనిఖీల్లో భాగంగా ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ పర్యటించారు.

Published : 26 Nov 2022 04:54 IST

ఉసూరుమనిపించిన ద.మ.రై. జీఎం పర్యటన

రామగుండం స్టేషన్‌లో సమస్యలపై జీఎంకు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే చందర్‌

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి, రామగుండం, న్యూస్‌టుడే: వార్షిక తనిఖీల్లో భాగంగా ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ పర్యటించారు. అయితే సమస్యలపై వివిధ వర్గాల నుంచి వినతిపత్రాలు తీసుకోవడమే తప్ప ప్రత్యేక రైళ్ల ప్రకటన, నిలుపుదల, అదనంగా ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం ప్రయాణికులకు నిరాశే మిగిల్చింది. మధ్యాహ్నం 1.30కి ప్రత్యేక రైలులో వచ్చిన జీఎం రామగుండం స్టేషన్‌ మూడో ప్లాట్‌ఫాంపై దిగి అక్కడే ఉన్న లిఫ్ట్‌లో ఎక్కేందుకు ప్రయత్నించగా సాంకేతికంగా మొరాయించింది. దీంతో మెట్ల మార్గంలో మొదటి ప్లాట్‌ఫాంకు వెళ్లారు. అనంతరం టికెట్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులతో మాట్లాడారు. రన్నింగ్‌ రూం వద్ద మహిళా లోకో పైలట్ల కోసం నిర్మించిన విశ్రాంతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వంట గది, విశ్రాంతి గదుల్లో లైటింగ్‌ సౌకర్యం, మౌలిక వసతుల కల్పన నాసిరకంగా ఉండటంపై గుత్తేదారును ప్రశ్నించారు. మహిళా లోకోపైలట్లతో మాట్లాడి సమస్యలు విన్నారు. అనంతరం స్టేషన్‌ వెనుక వైపు నిర్మించిన పిల్లల పార్కును ప్రారంభించి కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు. అక్కడి నుంచి మూడో ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లి సరకు రవాణా రైలును పచ్చజెండా ఊపి పంపించారు. రైల్వే కాలనీలో ఆధునికీకరించిన ఆసుపత్రి భవనం, ఆర్‌వోహెచ్‌ వ్యాగన్‌ షెడ్డు పార్కులో ఏర్పాటు చేసిన 1940 నాటి పురాతన హెరిటేజ్‌ వ్యాగన్‌లను పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీఎం ప్రారంభించారు. ఆర్‌వోహెచ్‌ షెడ్డు వద్ద మొక్కలు నాటిన తర్వాత అసిస్టెంట్‌ డివిజనల్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంపైన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. సుల్తానాబాద్‌, మెట్‌పల్లిలలో నిర్మించిన వేయింగ్‌ బ్రిడ్జిలను సమావేశ మందిరం నుంచి రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులకు పోలీసులతో వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. సమస్యలపై జీఎంకు విన్నవించడానికి వస్తే అనుమతించకపోవడంపై వాగ్వాదానికి దిగారు. అనంతరం వారిని అనుమతించగా వినతిపత్రాలు, విజ్ఞప్తులు తీసుకోవడమే తప్ప జీఎం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. విలేకరులతో మాట్లాడకుండానే ప్రత్యేక రైలులో మంచిర్యాల స్టేషన్‌కు వెళ్లారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్‌ఎం అభయ్‌కుమార్‌గుప్తా, స్థానిక కార్పొరేటర్‌ సతీష్‌కుమార్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు కోరుకంటి చందర్‌, డీఆర్‌యూసీసీ సభ్యుడు క్యాతం వెంకటరమణ, ఎన్‌డీ తివారీ, స్థానిక నాయకులు రాజలింగం, వివేక్‌పటేల్‌, పి.మహేశ్‌, పీసీసీ కార్యదర్శి పెర్కశ్యామ్‌లు జీఎంకు వినతిపత్రాలు అందజేశారు. పెద్దపల్లి, రామగుండం స్టేషన్లలో అన్ని సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను నిలపాలని, స్టేషన్‌లోకి ఆటోలను అనుమతించాలని, పార్కింగ్‌ షెడ్లు నిర్మించాలని, పెండింగ్‌ వంతెనలు పూర్తి చేయాలని, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు