logo

షడ్రుచులు..సమ్మిళిత ఫలితాలు!

వసంత రుతువు సాక్షిగా వెలుగులు పంచేందుకు శుభకృత్‌ పేరు మార్చుకుని శోభకృత్‌గా మన ముంగిటకొచ్చింది. వసంతమై పరవశిస్తూ.. శిశిరంలో రాలిన ఆకుల్లా ‘చేదు’ జ్ఞాపకాలను మరిపిస్తూ కొత్త చిగురు తొడిగిన కొమ్మలా ‘తీపి’ గురుతులు పంచాలని ఉవ్విళ్లూరుతోంది

Updated : 22 Mar 2023 06:29 IST

కొత్త సంవత్సరం శుభాలు కలగాలి
నేడు శోభకృత్‌ నామ ఉగాది
న్యూస్‌టుడే, మేడిపల్లి, ఈనాడు, కరీంనగర్‌

వసంత రుతువు సాక్షిగా వెలుగులు పంచేందుకు శుభకృత్‌ పేరు మార్చుకుని శోభకృత్‌గా మన ముంగిటకొచ్చింది. వసంతమై పరవశిస్తూ.. శిశిరంలో రాలిన ఆకుల్లా ‘చేదు’ జ్ఞాపకాలను మరిపిస్తూ కొత్త చిగురు తొడిగిన కొమ్మలా ‘తీపి’ గురుతులు పంచాలని ఉవ్విళ్లూరుతోంది.. ఈ ఉగాది శుభ సమయాన మన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పంచాంగాన్ని అక్షరీకరిస్తే ఎలా ఉంటుందో మీ కోసం...
* మహిళలే మహారాణులు అని కొలిచే జిల్లాలో అధికారులుగానూ, ప్రజాప్రతినిధులు గానూ మహిళలు పదవుల్లో ఉన్నారు. కానీ గృహహింస పేరిట గత మూడేళ్లలో 3,357 కేసులు నమోదయ్యాయనే చేదు వార్త అందరినీ కలచి వేస్తోంది. ఈ ఏడాది నుంచయినా మనమంతా అతివలకు అండగా ఉందాం.
* కొత్త ఏడాదిలో అడుగు పెట్టే సమయానికే టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రద్దు చేశారని తెలిసి యువకులు నైరాశ్యంలో ఉన్నారు. అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1ను ఉమ్మడి జిల్లా నుంచి 27,100 మంది యువత పరీక్షలు రాశారు. పరీక్షల ఫలితంతో ‘తీపి’ కబురు చేరుతుందనుకుంటే ‘వగరు’ లాంటి లీకేజీ వార్త యువకులను కలచి వేసింది. ప్రవేశ పరీక్ష లీకేజీకి, జిల్లాకూ సంబంధాలుండటం యువకులను ‘కారాలు’ మిరియాలు నూరేలా చేస్తోంది. అయినా వెలుగులు పంచేందుకే వచ్చిన శోభకృత్‌ నామ సంవత్సరం యువకుల్లో మనోధైర్యం కోల్పోకుండా అండగా ఉంటుంది. గతాన్ని చేదు అనుభవంగా భావించి మళ్లీ నిర్వహించనున్న పరీక్షలకు యువకులు సిద్ధం కావాలి. పదో తరగతి, ఇంటర్‌, జేఈఈ, నీట్‌ లాంటి పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా ఈ ఏడాది శ్రమకు తగిన ‘తీపి’ కబురు అందాలి.

ఉగాది అనగానే షడ్రుచుల మిళితమైన పచ్చడి గుర్తుకు వస్తుంది. తీపి, వగరు, కారం, చేదు, పులుపు, ఉప్పు.. వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకుంటేనే ఆరోగ్యం అన్నట్లుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ అన్ని రుచులను పోలిన ఘటనలే కనిపిస్తున్నాయి. నూతన తెలుగు వత్సరాది రాకమునుపే వడగళ్లు, అకాల వర్షం రైతన్నకు ‘చేదు’ అనుభవాన్ని మిగిల్చాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో జరిగిన పంట నష్టం రైతన్నకు కడగండ్లను మిగిల్చింది. కారం లాంటి ఘటనలు ఎదురైనా పంటలపై మమకారం కలిగిన రైతులు శ్రమనే నమ్ముకుంటే ఈ శోభకృత్‌ నామ సంవత్సరంలో తీపి దిగుబడులు సాధిస్తారనడంలో అతిశయోక్తి లేదు.
ఈ సంవత్సరం పాడి పంటలకు బలరామకృష్ణులు అధినాయకులని పంచాంగం చెబుతోంది. సకాలంలో వర్షాలు, పాడి పంటల వృద్ధి, ప్రాణికోటికి సుఖంగా ఉన్నందున తొలుత వ్యయం ఎక్కువైనా ఆదాయం పెరిగేలా దిగుబడులపై దృష్టి నిలపాలి.
* వాతావరణ మార్పులు పంటలపై ప్రభావం చూపుతున్నాయి. ఉగాది పచ్చడిలో వేప పువ్వు కలుపుదామనుకుంటే చాలా ప్రాంతాల్లో వేప చెట్లకే ఫంగస్‌ వ్యాపించింది. మామిడి కాయలపై వడగళ్లు ప్రభావం చూపాయి. పసుపునకు మద్దతు ధర కరవైంది. ముత్యంపేట చక్కెర కర్మాగారం మూతబడి చెరకు రైతులు చేదు ఫలితాలను అనుభవిస్తున్నారు. రైతుల గోస తీరేలా, పంటల దిగుబడి బాగుండేలా శోభకృత్‌ నామ సంవత్సరం శుభ ఫలితాలను ఇవ్వాలని కోరుకుందాం.
* ఈ ఏడాది ఎన్నికల నామ సంవత్సరంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే పాదయాత్రల పేరిట రాజకీయ వేడి పెరిగింది. అవమానాలు ఎదురైనా, రాజపూజ్యం దక్కక పోతుందా అని పలువురు రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు. గతంలో చేదు ఫలితాలు పొందిన నాయకులు ఇప్పుడు తీపి కబురు అందకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. పులుపు, ఉప్పు కలగలిపి మరీ ఓటరు నాడి పట్టుకునేందుకు యత్నిస్తారు. టికెట్ల వేటలో ప్రత్యర్థుల ‘గ్రహణం’ పట్టినా ఎలాగోలా ‘రాజు’ దృష్టిలో పడేందుకు నానా తంటాలూ పడతారు.

‘ఆదాయం’ ఘనమైనా..!

ఉమ్మడి జిల్లా స్థూల ఆదాయం మరింత పెరగాలి. ఇప్పటికే ప్రతి ఆర్థిక సంవత్సరంలో సహజ సంపద (గనులు, ఇసుక) ద్వారా సమకూరుతున్న కోట్లాది రూపాయల రాబడితో రాష్ట్రంలోనే తొలి ఐదుస్థానాల్లో నిలుస్తోంది. ఇదే సమయంలో తలసరి ఆదాయం విషయంలో నాలుగు జిల్లాలు దాదాపుగా రూ.1.75 లక్షల సగటుతో జోరుమీదున్నాయి. గతేడాది జిల్లాభివృద్ధికి వచ్చే నిధులు దండిగానే అందాయి. ఆదాయం, వ్యయం విషయంలో సమతూకమనే పాత్ర పోషిస్తున్నా.. ఇంకా ప్రగతి అన్ని విధాలుగా అందేందుకు ఈ నవవసంతం వేదికగా మారాలి.
శుభకృత్‌ నుంచి శోభకృత్‌గా మారిన తెలుగు సంవత్సరంలో యువకులు, మహిళలు, విద్యార్థులు.. అన్ని రంగాల వారు శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ.. షడ్రుచుల్లో చేదు, వగరు, కారం ఫలితాలు తగ్గి.. తీపి ఎక్కువుండాలని.. జిల్లా వృద్ధి చెందాలని ఆశిద్దాం!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని