logo

విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు...

నేరెళ్ల, మెట్‌పల్లి, బుగ్గారం, ఇందుర్తి, మేడారం ఇవన్నీ తెలిసిన పేర్లే అనుకుంటున్నారా! ఆగండి. వాటికో ప్రత్యేకత ఉంది.

Published : 26 Oct 2023 07:34 IST

నాడు నియోజకవర్గ కేంద్రాలు

బుగ్గారం గ్రామంలోని గడి

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: నేరెళ్ల, మెట్‌పల్లి, బుగ్గారం, ఇందుర్తి, మేడారం ఇవన్నీ తెలిసిన పేర్లే అనుకుంటున్నారా! ఆగండి. వాటికో ప్రత్యేకత ఉంది. ఇవన్నీ ఒకప్పుడు శాసనసభ నియోజకవర్గాల పేర్లు. 1957 నుంచి 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఒక వెలుగు వెలిగిన ప్రాంతాలు. వీటిలో కొన్ని ఇప్పుడు మండల కేంద్రాలు కాగా, ఒకటి పురపాలక సంఘంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా అంటేనే పోరాటాల పుట్టినిల్లు. 1952లో తొలి ఎన్నికలు జరిగే నాటికి కమ్యూనిస్టులపై నిషేధం ఉండటంతో వారంతా పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ పేరుతో పోటీ చేయగా కాంగ్రెస్‌కు గట్టి పోటీనిస్తూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఎంతో మంది ఎన్నికయ్యారు. తాజా ఎన్నికల నేపథ్యంలో ఈ నియోజకవర్గాల గురించి, వాటి ప్రస్తుత పరిస్థితిపై ఒకసారి అవలోకనం చేసుకుందాం.

బుగ్గారం:  1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆది నుంచి కాంగ్రెస్‌, తెదేపా, స్వతంత్ర అభ్యర్థుల మధ్య పోరు నడిచింది. మొదటి ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 1978లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అంబల్ల రాజారాం, 1983లో కడకంట్ల గంగారాం గెలుపొందారు. 1985, 1994లో శికారి విశ్వనాథం (తెదేపా), 1989, 1999, 2004లో జువ్వాడి రత్నాకర్‌రావు తొలుత స్వతంత్ర అభ్యర్థిగా తర్వాత వరుసగా రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్‌ మంత్రి వర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా పని చేశారు. 2009లో ఈ నియోజకవర్గం పెగడపల్లి, గొల్లపల్లి, మేడారం, వెల్గటూరు, ధర్మారం, బుగ్గారం, ధర్మపురి మండలాలతో ధర్మపురి (ఎస్సీ రిజర్వుడు) నియోజకవర్గంగా మారింది. 2016 జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటులో బుగ్గారం 11 గ్రామాలతో మండల కేంద్రమైంది.

మేడారం:  1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి జనరల్‌ స్థానంలో పీడీఎఫ్‌ నుంచి జి.లక్ష్మారెడ్డి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983, 1989లో రెండు సార్లు కాంగ్రెస్‌ తరఫున,  1999లో తెదేపా తరఫున మాతంగి నర్సయ్య మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో చివరిసారి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికయ్యారు. కాకతీయుల సామంతుడు మేడరాజు పాలనకు సాక్ష్యంగా ఇక్కడ నందిని ఏర్పాటు చేశారు. ధర్మారం మండలంలోని నందిమేడారం గ్రామంగా ప్రాచుర్యంలో ఉంది. పేరుకే ఇది నియోజకవర్గ కేంద్రమైనా ప్రభావం అంతా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామం ధర్మపురి నియోజకవర్గంలో ఉండగా రామగుండం ప్రత్యేక నియోజకవర్గమైంది.

కమలాపూర్‌: 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గం జనరల్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా 1967లో కాంగ్రెస్‌ తరఫున కేవీ నారాయణరెడ్డి గెలుపొందారు. 1972, 1978లో స్వతంత్ర జనతా పార్టీ నుంచి పరిపాటి జనార్దన్‌రెడ్డి గెలుపొందారు. 1985, 1989, 1994, 1999లలో తెదేపా నుంచి ముద్దసాని దామోదర్‌రెడ్డి ఎన్నికయ్యారు. చివరగా 2004లో ఈటల  రాజేందర్‌ గెలుపొందారు. 2009లో హుజూరాబాద్‌లో కలిసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కమలాపూర్‌ మండలం జిల్లాల పునర్విజనలో హనుమకొండలో కలిసింది.

మెట్‌పల్లి: ఖాదీ వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ పట్టణానికి ఉమ్మడి జిల్లాలో ఎంతో ప్రత్యేకత ఉంది. 1957లో జనరల్‌ స్థానంగా ఏర్పడిన ఈ నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా పీడీఎఫ్‌ పార్టీ నుంచి జె.ఆనందరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు వివిధ ఎన్నికల్లో గెలిచారు. భాజపా సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985, 1989, 1994లో మూడు సార్లు జయకేతనం ఎగురవేశారు. నియోజకవర్గం రద్దయిన 2004లో చివరిసారిగా కొమిరెడ్డి రాములు జేపీ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన మెట్‌పల్లి తర్వాత కోరుట్ల నియోజకవర్గంలో కలిసిపోయింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ప్రముఖ పురపాలక సంఘంగా, రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కొనసాగుతోంది. ఇక్కడ రాజకీయ, వాణిజ్య కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి.

నేరెళ్ల: సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో ఉన్న ఈ గ్రామం నియోజకవర్గ కేంద్రంగా ఉండేది. 1952లో ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బండారి జానకీరాం తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967, 1972లలో స్వతంత్ర అభ్యర్థిగా గొట్టె భూపతి గెలిచారు. 1978, 1983, 1989లలో కాంగ్రెస్‌ నుంచి పాటిరాజం ప్రాతినిధ్యం వహించారు. 1994, 1999లలో తెదేపా నుంచి సుద్దాల దేవయ్య, 2004లో చివరగా భాజపా నుంచి కాసిపేట లింగయ్య గెలుపొందారు. తర్వాత పూర్తిగా సిరిసిల్ల నియోజకవర్గంలో కలిసి ప్రస్తుతం గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది.

ఇందుర్తి: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటానికి వేదికగా నిలిచిన హుస్నాబాద్‌ ప్రాంతంలోనిదే ఈ నియోజకవర్గం. 1957లో ఈ జనరల్‌ స్థానం నుంచి పీడీఎఫ్‌ తరఫున పి.చొక్కారావు తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1972లో ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు బద్దం ఎల్లారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 1978, 1985, 1989లో మూడు సార్లు దేశిని చినమల్లయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో చాడ వెంకట్‌రెడ్డి చివరి సారి ఎన్నిక కాగా, 2009లో ఈ నియోజకవర్గం కొహెడ, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, హుస్నాబాద్‌, సైదాపూర్‌ మండలాలతో కలిపి హుస్నాబాద్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. చిగురుమామిడి మండలంలో ప్రస్తుతం ఇందుర్తి ఒక గ్రామంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని