logo

ఒక్కరే ఖరారు!

భాజపా మూడో జాబితాలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఒకే ఒక అభ్యర్థి పేరు ఖరారయింది.

Updated : 03 Nov 2023 05:07 IST

మంథని భాజపా అభ్యర్థిగా సునీల్‌ రెడ్డి 
మరో రెండు స్థానాల్లో పెండింగ్‌

ఈనాడు, పెద్దపల్లి, న్యూస్‌టుడే, మంథని: భాజపా మూడో జాబితాలో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఒకే ఒక అభ్యర్థి పేరు ఖరారయింది.. దసరా ముందు రోజు మొదటి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు చూపిన కమల దళం రెండో జాబితాలో ఎవరికీ చోటు కల్పించలేదు. గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో మిగతా మూడు స్థానాలకు ఖరారు చేస్తారని భావించగా మంథని నుంచి చంద్రుపట్ల సునీల్‌రెడ్డికి మాత్రమే అవకాశమిచ్చి పెద్దపల్లి, వేములవాడను పెండింగ్‌లో పెట్టింది. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవనుండగా.. మరో రెండు స్థానాల్లో ఆశావహులకు నిరీక్షణ తప్పడం లేదు. మంథని నియోజకవర్గం నుంచి చందుపట్ల సునీల్‌రెడ్డికే అవకాశం దక్కుతుందని శ్రేణులు భావించగా భారాస నేత చల్లా నారాయణరెడ్డి ఇటీవల భాజపాలో చేరడంతో ఆయనకు టికెట్‌ కేటాయిస్తారనే ప్రచారం సాగింది. చివరికి మంథనిలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన సునీల్‌రెడ్డికే అభ్యర్థిత్వం దక్కిందని కార్యకర్తలు సంబరాలు జరుపుకొన్నారు.
పేరు : చంద్రుపట్ల సునీల్‌రెడ్డి

తల్లిదండ్రులు : వసుమతి, రాంరెడ్డి (మంథని మాజీ శాసనసభ్యులు)

వయస్సు : 49

కుటుంబం : భార్య వినీత, కుమారుడు గౌరవ్‌, కూతురు అదితి

ప్రాథమిక స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు సునీల్‌రెడ్డి విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని ఆర్‌ఈసీలో బీటెక్‌ పూర్తి చేసిన ఆయన అమెరికాలో ఎంఎస్‌ చేశారు. 15 ఏళ్లు అక్కడే సిస్కో సిస్టమ్స్‌లో విధులు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితుడై 2010లో స్వదేశానికి వచ్చిన ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. 2014లో తెరాస నుంచి టికెట్‌ ఆశించినా రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో భాజపాలో చేరి క్రియాశీలక నేతగా మారి పార్టీ బలోపేతానికి కృషిచేశారు. 2023లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. 13 సంవత్సరాల నుంచి నాయనమ్మ అనసూయమ్మ పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భాజపా టికెట్‌ దక్కడంతో పోటీ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని