logo

విద్యాసాగర్‌రావుల హ్యాట్రిక్‌ విజయాలు

ఒకరు రద్దయిన మెట్‌పల్లి నియోజకవర్గం.. మరొకరు కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు.

Published : 09 Nov 2023 05:03 IST

న్యూస్‌టుడే, కోరుట్ల: ఒకరు రద్దయిన మెట్‌పల్లి నియోజకవర్గం.. మరొకరు కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించారు. మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి 1985లో చెన్నమనేని విద్యాసాగర్‌రావు భాజపా అభ్యర్థిగా మొదటిసారిగా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కొమిరెడ్డి రాములుపై 372 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో రెండోసారి భాజపా అభ్యర్థిగా బరిలో నిలబడి కాంగ్రెస్‌ అభ్యర్థి మిర్యాల కిషన్‌రావుపై 5,654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో మూడోసారి భాజపా అభ్యర్థిగా పోటి చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కొమిరెడ్డి రాములుపై 16,725 ఓట్ల మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజలో భాగంగా మెట్‌పల్లి నియోజకవర్గం రద్దయింది. మెట్‌పల్లి పట్టణం, కోరుట్ల పట్టణం, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల మండలాలను కలుపుతూ నూతనంగా కోరుట్ల నియోజకవర్గం ఆవిర్భవించింది. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెరాస అభ్యర్థిగా పోటీ చేయగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు పోటీలో నిలవగా 15,545 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తన ఎమ్మెల్యే పదవికి 2010లో రాజీనామా చేయాల్సి వచ్చింది. 2010లో జరిగిన కోరుట్ల ఉపఎన్నికల్లో విద్యాసాగర్‌రావు తెరాస తరఫున, కాంగ్రెస్‌ అభ్యర్థిగా రత్నాకర్‌రావు బరిలో నిలిచారు. విద్యాసాగర్‌రావు 56,525 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విద్యాసాగర్‌రావు మూడోసారి తెరాస అభ్యర్థిగా పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసిన జువ్వాడి నర్సింగరావుపై 20,505 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెరాస నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచిన జువ్వాడి నర్సింగరావుపై 31,220 ఓట్ల మోజార్టీతో గెలుపొంది, వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని