logo

చెరువులకు చెర !

 కరీంనగర్‌కు ఆనుకుని ఉన్న తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని ఓ రెండు కుంటలు కాలక్రమేణా కనుమరుగై పోయాయి.

Published : 27 Mar 2024 06:03 IST

శిఖం, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలు

కుంచించుకుపోయిన ఊరకుంట

 కరీంనగర్‌కు ఆనుకుని ఉన్న తీగలగుట్టపల్లి, ఆరెపల్లి సమీపంలోని ఓ రెండు కుంటలు కాలక్రమేణా కనుమరుగై పోయాయి. వీటితోపాటు స్థిరాస్తి వ్యాపారుల వల్ల ఇక్కడి మాలకుంట కుంచించుకుపోయింది. ఇదే తరహాలో ఉడతకుంట, అవుసుల కుంటలు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. తీగలగుట్టపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఊరకుంటలోనూ ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు జరిగాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఇక్కడి 8.2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని ఎలాగైనా తమ వశం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు.

 బొమ్మకల్‌ భూ మాఫియా ఆగడాల వల్ల ఇక్కడి పెద్ద చెరువులకు ‘చెర’ తప్పలేదు. ఇక్కడ వందలాది ఎకరాలు పరుల వశమైనట్లే.. ఇక్కడి విలువైన చెరువుల్లోనూ దర్జాగా కబ్జాకాండ కొనసాగింది. జక్కప్ప చెరువు (46.21 ఎకరాలు), రావికుంట (9.10 ఎకరాలు), గోపాల్‌ చెరువు (28.10 ఎకరాలు), నల్ల చెరువు (16.10 ఎకరాలు), గోదుమకుంట (12 ఎకరాలు).. ఇలా ముఖ్యమైన వాటన్నింటికి ముప్పు ఎదురైంది. చాలాచోట్ల వీటి శిఖం స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఇవేకాకుండా రెండు మూడు చిన్న కుంటలు మాయమై అందులో స్థిరాస్తి వ్యాపారం సాగుతోంది.

 కరీంనగర్‌ చుట్టే కాదు.. జిల్లాలోని పలు మండలాల్లోనూ చెరువుల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న భూములే ఆసరాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వస్తున్న అర్జీల్లో చెరువులు, కుంటల ఆక్రమణపైనే ఎక్కువ. ఇటీవల గంగాధర మండలం గర్షకుర్తి ఊర చెరువులో దాదాపుగా 2 ఎకరాల స్థలంలో మట్టిని నింపారని గ్రామానికి చెందిన మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. నీళ్లు నిలిచి ఉండే స్థానంలో మట్టి నింపడంతో ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈనాడు, కరీంనగర్‌: భూముల ధరలకు రెక్కలు రావడంతో ప్రభుత్వ భూములతోపాటు చెరువులపై కొందరు స్థిరాస్తి వ్యాపారులు కన్నేస్తున్నారు. రూ.కోట్లు సంపాదించడానికి సులువైన మార్గం కావడం.. అధికారులను, నాయకులను మచ్చిక చేసుకుంటే సరిపోవడంతో జల వనరులను ఆక్రమించేస్తున్నారు. కరీంనగర్‌, జమ్మికుంట, హుజూరాబాద్‌, చొప్పదండి, గంగాధరలాంటి ప్రాంతాల్లో గుంట ధర రూ.15- రూ.20 లక్షలు పలుకుతుండటంతో పాత దస్త్రాలను తారుమారు చేసి వీటిని శిఖం పట్టాగా మార్చుకుంటున్నారు. సమీపంలో వెంచర్ల ఏర్పాటుతో కొందరు వ్యాపారులు మెల్లిగా తమ జాగాలో వీటి సరిహద్దులను కలిపేసుకుంటున్నారు. నిబంధనల్ని అతిక్రమించి చెరువుకు నీరందించే కాలువల రూపురేఖల్నే మారేస్తున్నారు.

సం‘రక్షణ’ లేకనే..!

  •  కబ్జా కాకుండా కాపాడే విషయంలో జిల్లాలో స్పష్టంగా లోపాలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా.. చర్యలు తీసుకున్న దాఖలాలు తక్కువగానే ఉంటున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఇతరత్రా ప్రలోభాల ఎరతో యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.
  •  హైకోర్టు ఇటీవల జల వనరుల కబ్జాలపై స్పందించింది. చెరువుల ఆక్రమణల్ని తీవ్రంగా పరిగణించాలని.. లేదంటే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవని వ్యాఖ్యలు చేసింది. ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌)లో నిర్మాణాలు, మట్టితో పూడ్చడం, కట్టలను తొలగించడంపై దృష్టి పెట్టాలని, కఠిన చర్యలుండాలని ఆదేశించింది.
  •  కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలన్నీ కలిపి 1008 ఉంటాయి. దాదాపుగా 13,456.91 హెక్టార్లలో వీటి విస్తీర్ణం ఉంటుంది. పెద్ద చెరువులకు కొద్దిగా ముప్పు తక్కువగా ఉన్నా.. చిన్న కుంటలు మాత్రం చాలా చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. ఎక్కడా హెచ్చరిక బోర్డులు లేక కబ్జా కోరులకు చిక్కాయి.

    సర్వే చేయించి చర్యలు

జిల్లాలో చెరువుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రస్తుతం చెరువులో నీటిమట్టం తగ్గడం వల్ల నీటి నిల్వ స్థాయిని (ఎఫ్‌టీఎల్‌) గుర్తించేందుకు సర్వే చేయిస్తామని ఇటీవలే ఉన్నతాధికారులకు లేఖ రాశాం. ఆదేశాలు రాగానే అన్ని చెరువులపై ఒక నివేదికను తయారు చేసి సంరక్షణకు చర్యలు తీసుకుంటాం.
- శివకుమార్‌, ఎస్‌ఈ, నీటిపారుదలశాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని