logo

మంతనాలు.. భేటీలు

క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. తమ పార్టీ వారెవరైనా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. ప్రత్యర్థి ప్రచారం ఎలా సాగుతోంది.. అని అభ్యర్థులు ఓ వైపు తమ పార్టీ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు..

Published : 16 Apr 2024 03:39 IST

ప్రచారంలో జోరు పెంచుతున్న అభ్యర్థులు
ఈనాడు, కరీంనగర్‌

క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది.. తమ పార్టీ వారెవరైనా ఇతర పార్టీల వైపు చూస్తున్నారా.. ప్రత్యర్థి ప్రచారం ఎలా సాగుతోంది.. అని అభ్యర్థులు ఓ వైపు తమ పార్టీ నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు.. మరోవైపు కార్యకర్తలు.. వివిధ వర్గాల వారితో సమావేశమవుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.. ఇన్నాళ్లూ కొనసాగించిన ప్రచారం ఒక  ఎతైతే ఇక మీదట మరింత జోరు పెంచాల్సిన తరుణంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.. ఆయా పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానిస్తూ అభ్యర్థులు శాసనసభ సెగ్మెంట్‌ల వారీగా సన్నాహక సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. మండలాల వారీగా పోలింగ్‌ కేంద్రాల్లో బాధ్యులుగా ఉన్న కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశాల్లో కీలకమైన విషయాల్ని వివరిస్తున్నారు. ప్రత్యుర్థులు దీటుగా ఎలా ముందుకు వెళ్లాలనే విషయాన్ని తెలియజెప్పడంతోపాటు రోజువారీగా శ్రేణులకు ప్రచార కార్యాచరణను అందిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్‌ బూత్‌ల వారీగా ప్రతి 100 మందికి ఒకరిని ఇన్‌ఛార్జిగా అన్ని పార్టీలు ఇప్పటికే నియమించాయి. ఈ విషయంలో కరీంనగర్‌ నియోజకవర్గ భాజపా, భారాస అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలను ఈసారీ పక్కాగా ఆచరణలో చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇదే పంథాను అవలంబిస్తుండగా.. నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలో కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాలపై ఇటీవలే ఈ తరహా కసరత్తును షురూ చేశారు. కరీంనగర్‌లో మాత్రం అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ దిశగా ఇంకా కసరత్తు మొదలు పెట్టలేదు.

హామీలతో కరపత్రాలు

భాజపా, భారాస, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కరపత్రాలు, ఇంటికి అతికించే స్టిక్కర్ల పంపిణీ ప్రారంభించారు. కరీంనగర్‌ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కు చెందిన కరపత్రాలు సోమవారం ఒకే రోజున వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు వెళ్లే విధంగా శ్రేణులను సిద్ధం చేసి పంపిణీ చేయించారు. ఇదే తరహాలో భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ కూడా ఆయా మండలాలకు పంపించారు. అటు నుంచి వాటిని ఇంటింటికి చేరే బాధ్యతను మండలాధ్యక్షులకు అందించారు. నిజామాబాద్‌, పెద్దపల్లి స్థానాల్లోనూ పోటీదారులు ఇలాంటి కరపత్రాలతో తమ ఎజెండాను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. తాము గెలిస్తే ప్రజలకేం చేస్తామో కరపత్రాల్లో ప్రస్తావిస్తున్నారు. భాజపా అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని తమ ప్రచారానికి వాడుకుంటుండగా.. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఏఐసీసీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. భారాస అభ్యర్థులు మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపడాన్ని తమ ప్రధాన అస్త్రంగా మలుచుకుంటున్నారు.

బలాబలాల విశ్లేషణ

ఏ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి? అక్కడ మనకు వచ్చిన ఓట్లెన్ని? అనే విషయమై మండలాల వారీగా ముఖ్య నేతలతో అభ్యర్థులు ఫోన్‌లో లేదా వీలుని బట్టి ప్రత్యక్ష సమీక్షలను నిర్వహిస్తూ పరిస్థితిపై అంచనాకు వస్తున్నారు. ఓట్లు రాబట్టే వ్యూహంలో భాగంగా భారాస, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులు తమ బలాబలాలను శాసనసభ నియోజకవర్గాల వారీగా విశ్లేషించుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో మూడు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌, భారాసలకు ఎక్కువ శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఆ ఓట్లను కాపాడుకుంటూనే ప్రత్యర్థి పార్టీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. మూడో స్థానానికి పరిమితమైన భాజపా 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయన్న ధీమాతో ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌ స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకున్న విషయం విదితమే. అయినా ఏ అవకాశాన్ని వదలకుండా ప్రత్యర్థుల ఎత్తుగడలను గమనిస్తూ భాజపా అభ్యర్థులు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని