logo

రేపటి నుంచి మూడంచెల భద్రతా వ్యవస్థ

లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘడియలు సమీపిస్తున్నాయి. పాలనా ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్‌ స్వీకరించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

Published : 17 Apr 2024 05:22 IST

కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ కార్యాలయం ముస్తాబు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘడియలు సమీపిస్తున్నాయి. పాలనా ప్రాంగణంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్‌ స్వీకరించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచే భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. రోడ్డుకిరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి(కలెక్టర్‌) ఛాంబర్‌ నుంచి 100 నుంచి 300 మీటర్ల వరకు పోలీసు బలగాల పహారాతో మూడంచెల భద్రత వ్యవస్థ మధ్య నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టరేట్‌ ఉద్యోగులకు వారి గుర్తింపు కార్డుల ఆధారంగా విధుల్లోకి అనుమతి ఇస్తారు. సందర్శకులకు మధ్యాహ్నం 3 తర్వాతే అనుమతి ఉంటుంది.

అడుగడుగునా నిఘా

కలెక్టరేట్‌ ఆవరణలో అడుగడుగునా భద్రత చర్యలు తీసుకుంటున్నారు. నామపత్రాల స్వీకరణలో ఎలాంటి ఘర్షణలు, అల్లర్లకు తావులేకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అభ్యర్థుల ర్యాలీలను రెండు వందల మీటర్ల లోపు నిలిపి వేయనున్నారు. మూడు వాహనాలను వంద మీటర్ల వరకు.. అక్కడి నుంచి అభ్యర్థితో పాటు మరో నలుగురిని లోపలికి అనుమతిస్తారు. ప్రతీ అంశాన్ని వీడియోలో చిత్రీకరించనున్నారు.

సర్వం సిద్ధం

  • ఎంపీ పరిధిలో పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 15,92,996 ఓటర్లు ఉండగా ఇందులో 7,87,140 పురుషులు, 8,05,755 మహిళలు, 101 ఇతర ఓటర్లుగా నమోదయ్యారు.
  • కలెక్టరేట్‌ రెండో బ్లాక్‌ నుంచి ఉద్యోగులను విధులకు అనుమతించనున్నారు. నామినేషన్‌ స్వీకరణ సమయంలో సందర్శకులకు అనుమతి నిరాకరించనున్నారు.
  • ఎంపీ స్థానం ఎస్సీ రిజర్వు కావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రూ.12,500 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.
  • నామినేషన్‌ వేసే ముందు రోజు తాజా బ్యాంక్‌ ఖాతా తెరిచిన పాసుపుస్తకాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. నేరచరిత ఆధారాలు పొందుపరచాలి. నమోదైన కేసుల వివరాలు నివేదించాలి. అభ్యర్థులు నాలుగు సెట్ల నామపత్రాలు దాఖలు చేయాలి. ఎన్నిక సంఘం నిర్దేశించిన ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని