logo

అన్ని వివరాలు పూరించాల్సిందే!

సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు కీలకమైన ఈ దశలో ఏ మాత్రం తప్పుదొర్లినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

Published : 17 Apr 2024 05:37 IST

నామినేషన్‌ దాఖలులో అప్రమత్తత అవసరం
న్యూస్‌టుడే, గోదావరిఖని, కరీంనగర్‌ పట్టణం

సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు కీలకమైన ఈ దశలో ఏ మాత్రం తప్పుదొర్లినా తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి కాలమ్‌నూ జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది. నామపత్రంతో పాటు అఫిడవిట్‌లోనూ పూర్తి వివరాలు ఉండేలా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాలను పూరించే తీరుపై న్యాయవాదులతో సంప్రదిస్తున్నారు.

ఒక్కటి వదిలేసినా తిరస్కరణే

అభ్యర్థులు ప్రమాణ పత్రంలోని ప్రతి కాలమ్‌నూ పూరించాలి. ఒక్కదాన్ని వదిలేసినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. సంబంధం లేని అంశం వద్ద ‘నిల్‌’ వర్తించదు అని రాయాలి. ప్రమాణ పత్రంలో ఏదైనా సమాచారం లేకపోతే ఎన్నికల అధికారి నోటీసు ఇస్తారు. దాన్ని సవరించి తిరిగి అందజేయాలి. అప్పటికీ తప్పులుంటే పరిశీలన సమయంలో నామినేషన్‌ను తిరస్కరిస్తారు. అభ్యర్థులు దాఖలు చేసిన ప్రమాణ పత్రాలను నోటీసు బోర్డుతో పాటు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

ఆస్తుల వివరాలన్నీ రాయాల్సిందే

అఫిడవిట్‌లో స్థిర, చరాస్తుల వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. బ్యాంకు ఖాతాల్లో నగదు, డిపాజిట్లు, సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పుల వివరాలు నమోదు చేయాలి. చేతిలో ఉన్న నగదును కూడా పేర్కొనాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వివరాలను ప్రస్తావించడంతో పాటు అవి ఎలా వచ్చాయో కూడా రాయాలి. స్థిరాస్తుల ప్రస్తుత మార్కెట్‌ విలువ చూపాలి. అభ్యర్థితో పాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు, వాటి వివరాలు, వారి ఆదాయ మార్గాలు, ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో కాంట్రాక్టులుంటే వాటి వివరాలు నమోదు చేయాలి.

శిక్షలు.. కేసులు

నేర చరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రమాణ పత్రంలో నమోదు చేయాలి. ఏదైనా నేరానికి సంబంధించిన శిక్షలు పడి ఉంటే వివరాలు ప్రస్తావించాలి. అప్పీలుకు వెళ్లినా వివరాలు నమోదు చేయాలి. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలియజేయాలి. నోటరీ తప్పనిసరిగా చేయించాలి. అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటన ఇవ్వాలి.

ఓటర్లకు అవగాహన

ఎన్నికల సమయంలో అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం ఓటర్లకు తెలియాలి. కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల పూర్తి సమాచారంతో కూడిన అఫిడవిట్‌ను వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. నిబంధనలకు లోబడి ఫారం-26 ద్వారా అభ్యర్థులు తప్పనిసరిగా అఫిడవిట్‌ సమర్పించాలి. అందులోనే ఆస్తులు, అప్పులు, కేసులు, ఇతర పూర్తి సమాచారం అందులో ఉండటంతో ఓటర్లు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా ఓటు ఎవరికి వేయాలో నిర్ణయించుకొనే అవకాశం ఉంటుంది.


పారదర్శకంగా పొందుపరచాలి

-ఎం.అనిల్‌కుమార్‌, న్యాయవాది, కరీంనగర్‌

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫాం 26 ద్వారా ఎన్నికల నిబంధనలకు లోబడి పోటీ చేసే అభ్యర్థులు అఫిడవిట్‌ను సమర్పించాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, కులం వివరాలు ఉండాలి. ముఖ్యంగా ఆస్తులు, అప్పులు, నేర వివరాలను పారదర్శకంగా పొందుపరచాలి. అఫిడవిట్‌ను నోటరీ చేయించాలి. తప్పులుంటే న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అభ్యర్థుల వివరాలను ప్రజలు తెలుసుకునే అవకాశముంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని