logo

గౌరవ వేతనం జాడేది?

కరీంనగర్‌ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్‌ స్టేడియం వేదికగా ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడకు పంపిస్తుంటారు.

Published : 17 Apr 2024 05:39 IST

వేసవి శిబిరాల కోచ్‌ల ఎదురుచూపులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ క్రీడా విభాగం

కరీంనగర్‌ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా అంబేడ్కర్‌ స్టేడియం వేదికగా ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను అట్టహాసంగా నిర్వహిస్తుంటారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడకు పంపిస్తుంటారు. గతేడాది మే, జూన్‌ నెలలో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో సుమారు 2500 మంది చిన్నారులు శిక్షణ పొందారు. పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు సుమారు 70 మంది కోచ్‌లను క్రీడా శాఖ ఎంపిక చేసింది. శిక్షణ కాలంలో కోచ్‌లకు గౌరవ వేతనంగా కొంత మొత్తాన్ని నగరపాలక సంస్థ ఇస్తోంది. గత వేసవి క్రీడా శిబిరంలో కోచ్‌లకు గౌరవ వేతనం ఇప్పటికీ అందలేదు.

పట్టించుకునే వారు కరవు..

కరీంనగర్‌ బల్దియా ఆధ్వర్యంలో 2023 మే 5 నుంచి జూన్‌ 7 వరకు 28 అంశాల్లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కోచ్‌లకు గౌరవ వేతనం ఇవ్వడం ఆనవాయితీ. వేసవి సెలవుల్లో అందరూ విహారయాత్రలకు వెళ్తుంటే 70 మంది కోచ్‌లు మాత్రం విద్యారులకు క్రీడా నైపుణ్యాలను అందించారు. శిబిరం ముగిసిన తర్వాత వారిని పట్టించుకునే వారే కరవయ్యారు. మళ్లీ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా గౌరవ వేతనం ఇవ్వాలని కోచ్‌లు కోరుకుంటున్నారు. తామందరం ప్రైవేటు పాఠశాలల్లో పీఈటీలుగా, క్రీడలకు కోచ్‌లుగా చాలీచాలని జీతాలతో పని చేస్తున్నామని మొర పెట్టుకున్నా అధికారులు ఆలకించలేదని కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌, డీవైఎస్‌వో, జిల్లా ఒలింపిక్‌ సంఘం బాధ్యులకు విన్నవించుకున్నా లాభం లేదని వాపోతున్నారు. 2018, 2019లో నిర్వహించిన శిబిరాల్లో పాల్గొన్న కోచ్‌లకు ఆరు నెలలు గడిచిన తర్వాత గౌరవ వేతనం ఇచ్చారు. తర్వాత కరోనా కారణంగా శిబిరాలు నిర్వహించలేదు. గతేడాది 2022లో నిర్వహించగా.. ఇప్పటికీ ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు