logo

వసతుల మెరుగుకు కార్యాచరణ

ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు.

Updated : 18 Apr 2024 05:13 IST

నగరపాలక సంస్థలకు నిధులు

కరీంనగర్‌లోని నీటిశుద్ధి కేంద్రం

న్యూస్‌టుడే - కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం సుమారు 85 శాతం, మిగతా 15 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(యూఐడీఎఫ్‌) పథకం అమలుకు కేంద్ర, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. కాగా మొదటి విడతలో లక్షకు పైగా జనాభా కలిగిన నగర పాలికలను ఎంపిక చేశారు. దశల వారీగా ఈ పథకాన్ని విస్తరించనున్నారు.

కరీంనగర్‌లో భూగర్భ మురుగుకాలువ వ్యవస్థ

కరీంనగర్‌ నగర పరిధిలో అమృత్‌ పథకంలో భాగంగా తాగునీటి సరఫరా పటిష్ఠం చేసేందుకు రూ.132.20 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో విలీన కాలనీల్లో పైపులైన్ల విస్తరణ, రిజర్వాయర్లు, సంపులు, నీటిశుద్ధి కేంద్రం వంటి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదించింది. మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మించేందుకు రూ.72.57 కోట్లు కేటాయించారు. తాజాగా యూఐడీఎఫ్‌ కింద భూగర్భ మురుగునీటి శుద్ధి కేంద్రం పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి, అయిదు జోన్లుగా విభజించి, విలీన కాలనీల నుంచి అనుసంధానం చేసేందుకు రూ.198 కోట్లు కేటాయించారు. సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, మ్యాన్‌హోల్స్‌ నిర్మించడం, 96 కిలోమీటర్ల పొడవునా పైపులైను వేసి, పాడైన రోడ్డుకు మరమ్మతు చేస్తారు.

రామగుండంలో తాగునీటికి ప్రాధాన్యం

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్‌లో భూగర్భ మురుగునీటి వ్యవస్థకు రూ.206.66 కోట్లు కేటాయించారు. ఇప్పటికే శుద్ధి కేంద్రం ఉండగా పెరిగిన కాలనీలను దృష్టిలో ఉంచుకొని, అధునాతన సౌకర్యాలతో యూజీడీ నిర్మిస్తారు. మరో వైపు యూఐడీఎఫ్‌ స్కీంలో భాగంగా తాగునీటి పథకానికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనికోసం రూ.88.90 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో నీటి శుద్ధి కేంద్రానికి నీటిని తీసుకోవడానికి 300 డయా పైపులైను 6.85 కిలోమీటర్లు, పంపింగ్‌ పైపులైను 68 కిలోమీటర్లు, కొత్తగా అయిదు రిజర్వాయర్లు, 15,400 ఇళ్లకు కొత్తగా నల్లా కనెక్షన్లు, సర్వీసు రిజర్వాయర్లు 2, స్కాడా మీటర్లు వంటికి ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని