logo

హాట్రిక్‌ విజేత..అరుదైన ఘనత

ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు.

Updated : 18 Apr 2024 05:20 IST

ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతల ప్రత్యేకత

న్యూస్‌టుడే, గోదావరిఖని: ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్‌ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ప్రజల్లో ఉన్న పట్టుతో ప్రత్యర్థులపై పైచేయి సాధించారు. ఎం.సత్యనారాయణరావు, జువ్వాడి చొక్కారావు, జి.వెంకటస్వామి, కె.చంద్రశేఖర్‌రావులు ప్రత్యేకత చాటుకున్నారు.

అయిదేళ్లలో మూడు సార్లు

భారాస(నాటి తెరాస) అధినేత కేసీఆర్‌ 2004లో కరీంనగర్‌ నుంచి మొదటిసారి లోక్‌సభకు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన సీహెచ్‌ విద్యాసాగర్‌రావుపై 1,31,168 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనంతరం 2006లో తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 2,01,582 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2008లో మరోసారి పదవి వదులుకొని, మరోసారి కాంగ్రెస్‌కు చెందిన టి.జీవన్‌రెడ్డిపై 15,765 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.


పార్టీలు వేరైనా విజయమే

ఎమ్మెస్సార్‌గా సుపరిచితులైన ఎం.సత్యనారాయణరావు కరీంనగర్‌ నుంచి వరుసగా గెలుపొంది రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్నారు. తెలంగాణ ప్రజా సమితి(టీపీఎస్‌), కాంగ్రెస్‌, కాంగ్రెస్‌(ఐ)ల నుంచి ఆయన లోక్‌సభకు ఎన్నికవడం విశేషం. 1971లో తొలిసారి టీపీఎస్‌ నుంచి పోటీ చేసిన ఎమ్మెస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జగపతిరావుపై 56,323 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత 1977లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి బీఎల్‌డీ అభ్యర్థి జె.గౌతంరావుపై 1,14,048 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 1980లో కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా చేసి జనతా పార్టీ అభ్యర్థి విద్యాసాగర్‌రావుపై 1,56,328 ఓట్ల ఆధిక్యంతో హ్యాట్రిక్‌ విజయం సొంతం చేసుకున్నారు.


రాజకీయ ఉద్ధండుడు చొక్కారావు

ఉమ్మడి జిల్లాలో రాజకీయ ఉద్ధండుడు జె.చొక్కారావు కాంగ్రెస్‌ పార్టీ తరఫున కరీంనగర్‌ నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. 1984లో తొలిసారి బరిలోకి దిగి స్వతంత్ర అభ్యర్థి మర్రి చెన్నారెడ్డిపై 78,607 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1989లో మరోసారి పోటీ చేసిన చొక్కారావు తెదేపా అభ్యర్థి చలిమెడ ఆనందరావుపై 35,192 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1991లో స్వతంత్ర అభ్యర్థి ఎన్‌.వి.కృష్ణయ్యపై 1,17,536 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.


ఒకే పార్టీ అభ్యర్థిపై వరుస గెలుపు

రాజకీయాల్లో తలపండిన నేతగా గుర్తింపు పొందిన గడ్డం వెంకటస్వామి(కాకా) పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుసగా మూడుసార్లు గెలిచారు. తొలిసారిగా 1989లో తెదేపా అభ్యర్థి గొట్టె భూపతిపై 30,635 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1991లో తెదేపా అభ్యర్థి సుద్దాల దేవయ్యపై 1,09,965 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 1996లో తెదేపా అభ్యర్థి సుద్దాల దేవయ్యపై 65,465 ఓట్ల ఆధిక్యంతో మూడోసారి విజయం సాధించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని