logo

సాహితీ పిపాసి..సోమన్న

అనతి కాలంలోనే సాహిత్య రంగంలో పట్టుసాధించి 36 పుస్తకాలను రచించి వెలుగులోకి తెచ్చిన సాహితీ పిపాసి గద్వాల సోమన్న అని సమతా సాహితీ కళా ట్రస్ట్‌ అధ్యక్షుడు డా.సురేంద్రబాబు పేర్కొన్నారు.

Published : 12 Jun 2023 04:26 IST

రచయిత గద్వాల సోమన్నకు బాలబందు బిరుదును ప్రదానం చేస్తున్న డా.బాబు, అతిథులు

బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే: అనతి కాలంలోనే సాహిత్య రంగంలో పట్టుసాధించి 36 పుస్తకాలను రచించి వెలుగులోకి తెచ్చిన సాహితీ పిపాసి గద్వాల సోమన్న అని సమతా సాహితీ కళా ట్రస్ట్‌ అధ్యక్షుడు డా.సురేంద్రబాబు పేర్కొన్నారు. శనివారం రాత్రి సమతాసాహితీ ఆధ్వర్యంలో రాఘవ కళామందిరంలో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. గణిత ఉపాధ్యాయుడు సోమన్న సాహిత్యంపై మక్కువతో సాధన చేసి సమాజానికి విద్యా వెలుగులు నింపారన్నారు. బాలలు చదివేలా..సామాన్య రూపంలో బాల సాహిత్య పుస్తకాలను తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చరవాణికి బానిసై పుస్తకాల పఠనంపై ఆసక్తి తగ్గిపోయిందని గుర్తించి, బాలలకు సాహిత్య రుచి చూపించేందుకు ఆయన చేస్తున్న అవిశ్రాంత సేవకు విలువ కట్టలేమన్నారు. 36 పుస్తకాలు ఎంతో చక్కని అమృత వాక్యాలతో తెలుగు రుచి పదబంధాలను అమర్చి కమ్మగా రాసి తెలుగుతల్లికి నివేదన సమర్పించారని తెలిపారు. విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు డా.లక్ష్మినారాయణ మాట్లాడుతూ చక్కటి సాహిత్యం తియ్యని పదజాలంతో అర్థరూపంలో పదాల కలయికతో కవి సోమన్న రచించడం శ్లాఘనీయమన్నారు. ఈ సందర్భంగా సోమన్నకు బాలాబందు బిరుదునిచ్చి, మైసూరు పేటతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. రచయిత సోమన్న మాట్లాడుతూ బళ్లారి నగరంలో నా సాహిత్యానికి ఇంతటి ప్రోత్సాహం అందించిన సాహితీప్రియులకు నా అభినందనలన్నారు. అనంతరం డా.సురేంద్రబాబును సన్మానించారు. కార్యక్రమంలో రాఘవ స్మారక సంఘం గౌరవ అధ్యక్షుడు చన్నప్ప, విష్ణువర్ధన్‌ రెడ్డి, రామాంజినేయులు, వెంకటేశులు, ఈశ్వరయ్య, వలీఅహ్మద్‌, డా.రమేష్‌గోపాల్‌, శ్రీనివాసరెడ్డి, జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని