logo

ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!

ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది.

Updated : 20 Apr 2024 06:34 IST

ప్రవర్తనా నియమావళి అమలుపై ఎంసీఎంసీ నిఘా

  • గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పలు పార్టీల అభ్యర్థుల చెల్లింపు కథనాలు (పెయిడ్‌ న్యూస్‌), ప్రకటనల జారీ విషయాలపై నోటీసులు జారీ అయ్యాయి.
  • ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గంలో బరిలో నిలిచిన అభ్యర్థులకు కూడా ఇదే కారణంగా నోటీసులు అందాయి. సరైన సమాధానం ఇవ్వకున్నా, నిబంధనల ఉల్లంఘించినట్లు తేలినా సదరు అభ్యర్థులు శిక్షార్హులే.

పాల్వంచ, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్‌ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది.  అభ్యర్థుల ప్రచార ఖర్చు, సామాజిక మాధ్యమాల ఖాతాలపై ఎన్నికల సంఘానికి చెందిన ‘మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ’ (ఎంసీఎంఎసీ) నజర్‌ పెడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే ప్రచార అంశాలను కూలంకషంగా పరిశీలించి అభ్యర్థుల ఖర్చు ఖాతాకు జమ చేస్తారు. ఉమ్మడి జిల్లాలోనూ జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ఎంసీఎంసీ విభాగం పటిష్ఠ విధులు నిర్వర్తిస్తోంది. దీని ఛైర్మన్‌గా  జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ వ్యవహరిస్తారు.

సామాజిక మాధ్యమాలపై దృష్టి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు పార్టీల ఎంపీ అభ్యర్థులు, ముఖ్యనేతలు సభలు, సమావేశాల నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్టీ మీడియా విభాగం, నాయకులు తమ పార్టీ ప్రాధాన్యాలు, హామీలు, అభ్యర్థి బలాబలాలు, గత విజయాలు, గుణగణాలపై సామాజిక మాధ్యమాల్లో కథనాలను తలపించే పోస్టులను పెడుతున్నారు. మరికొందరు వాటిని అత్యుత్సాహంతో స్థానిక వాట్సాప్‌ గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ తదితర వేదికల్లో షేర్‌ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఎన్నికల నిబంధనల ప్రకారం అవన్నీ ప్రకటనల ఖర్చుకిందే ఎన్నికల సంఘం గణిస్తుందన్న విషయాన్ని పార్టీలు, అభ్యర్థులు మరవొద్దని ఎంసీఎంసీ కమిటీ సూచిస్తోంది. అభ్యర్థులు నామినేషన్‌ వేసిన నాటి నుంచి చెల్లింపు కథనాలు, ప్రకటనలకు సంబంధించిన ఖర్చును వారి ఎన్నికల వ్యయ ఖాతాలో కలుపుతారు. ఎంసీఎంసీ ముందస్తు అనుమతి లేకుండా ప్రచరించే చెల్లింపు వార్తలు, ప్రకటనలు, ప్రసారాల్ని నిబంధన ఉల్లంఘన కారణంగా పరిగణిస్తారు. ఇదే కారణంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలామంది అభ్యర్థులకు ఈసీ నుంచి నోటీసులు అందాయి.


నిబంధన ఉల్లంఘిస్తే శిక్ష!

‘ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951’ ప్రకారం ఎన్నికల నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. అభ్యర్థులు జవాబుదారీతనంతో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాల్ని ఎన్నికల అధికారులకు తెలియజెప్పాలి.


గడిచిన మూడు ఎన్నికల్లో.. ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకే పట్టం

మధిర, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో 2009, 2014, 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టారు. 2009 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1,24,448 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకు 4,69,368 ఓట్లు రాగా రేణుకాచౌదరికి 3,44,920 ఓట్లు లభించాయి.  2014 ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 12,204 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4,22,434 ఓట్లు రాగా నామా నాగేశ్వరరావుకు 4,10,230 ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు తెరాస (ప్రస్తుత భారాస) తరఫున పోటీ చేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1,68,062 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా రేణుకాచౌదరికి 3,99,397 ఓట్లు లభించాయి.


ముఖ్యమంత్రులుగా పనిచేసి.. ఎంపీలుగా గెలిచి..

ఖమ్మం నగరం, న్యూస్‌టుడే: సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు నేతలు ఆ తర్వాత కాలంలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీలుగా గెలుపొందారు. 1972లో ఖమ్మం జిల్లా వేంసూరు (ప్రస్తుతం సత్తుపల్లి) శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జలగం వెంగళరావు 1973 నుంచి 1978 వరకు ఏపీ సీఎంగా పనిచేశారు. 1978 ఎన్నికల్లో ఆయన సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1984, 1989 ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

  • గుంటూరు జిల్లా వేమూరు శాసనసభ నియోజకవర్గం నుంచి 1983లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన నాదెండ్ల భాస్కర్‌రావు 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దె దింపి నెల రోజులు సీఎంగా పనిచేశారు. అప్పట్లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజా ఉద్యమంతో నాదెండ్ల భాస్కర్‌రావు సీఎం పీఠం దిగాల్సి వచ్చింది. అనంతరం 1998లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఖమ్మం లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. కొద్దినెలలు మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని