logo

ఆర్థిక స్వాతంత్య్రం సాధిద్దాం...

దేశం 75 వసంతాల స్వాతంత్య్ర మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటోంది. ఎక్కడ చూసినా.. మువ్వన్నెల రెపరెపలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎన్నో త్యాగాల ఫలితాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం. ఇదే స్ఫూర్తి మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడంలోనూ చూపాలి.

Published : 12 Aug 2022 02:58 IST

దేశం 75 వసంతాల స్వాతంత్య్ర మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటోంది. ఎక్కడ చూసినా.. మువ్వన్నెల రెపరెపలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎన్నో త్యాగాల ఫలితాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం. ఇదే స్ఫూర్తి మనం ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించడంలోనూ చూపాలి. వ్యక్తిగత ఆర్థికాభివృద్ధికి అవరోధాలుగా మారిన అలవాట్లను తరిమికొట్టాలి. అప్పుడే మనమూ ఆర్థిక విజయకేతనం ఎగరవేయగలం.
స్వాతంత్య్రం ఒక్క రోజులోనే సాకారమైన కల కాదు.. ఎన్నో ఏళ్ల శ్రమ. ఆర్థిక స్వేచ్ఛా ఒక్క రాత్రిలోనే సాధ్యం కాదు. దీన్ని అంచెలంచెలుగా అందుకోవాల్సిందే. దీనికోసం ఏం చేయాలన్నది తెలియజేస్తున్నారు ఆర్థిక నిపుణులు. వివిధ అంశాలపై వారు ఏం చెబుతున్నారో చూద్దామా...

ఆరోగ్యంగా ఉంటేనే..
మరుక్షణం ఏం జరుగుతుందన్నది మన ఊహకు అందదు. పెట్టుబడులు పెట్టడం భవిష్యత్‌ కోసం అవసరం. అదే సమయంలో ఆరోగ్య బీమా పాలసీని ఆర్థిక ప్రణాళికల్లో భాగం చేయాలి. మీ లక్ష్యాల సాధనకు జమ చేస్తున్న మొత్తాన్ని అనారోగ్యం హరించి వేయకుండా ఇది కాపాడుతుంది. పూర్తి స్థాయి ఆరోగ్య బీమా, ఓపీడీ ఖర్చులనూ చెల్లించేలా ఉన్నప్పుడే ఆర్థికంగా మీరు స్వేచ్ఛగా ఉండగలరు.
- శ్రీకాంత్‌ కందికొండ, సీఎఫ్‌ఓ, మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

ఈ క్షణమే..
ఆర్థిక స్వేచ్ఛ అవసరం ఏమిటన్నది యువతరానికి ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యింది. దీన్ని సాధించే దిశగా పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. తొందరగా పదవీ విరమణ చేయాలనే ఆలోచనతోనే వారి పెట్టుబడులు సాగుతున్నాయి. ఆర్థిక స్వాతంత్య్రం సాధనలో మనం ఎంచుకునే పథకాలు ఎంతో కీలకం. పెట్టుబడి పెట్టేందుకు వేచి చూడటంతో ఫలితం ఉండదు. ఆలోచన వచ్చిన క్షణమే పెట్టుబడులకు మంచి ముహూర్తం. మార్కెట్ల దశలను పట్టించుకోవద్దు. మీ లక్ష్యానికి తగ్గ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకొని, వాటిలో దీర్ఘకాలం కొనసాగడం ద్వారా సంపదను సృష్టించేందుకు వీలవుతుంది.
- రాఘవ్‌ అయ్యంగార్‌, చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌, యాక్సిస్‌ ఏఎంసీ
సంపాదించే వయసులోనే...
ఖర్చులే సరిపోతున్నాయి.. పెట్టుబడికి డబ్బెక్కడిది.. అంటే ఎప్పటికీ ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. సంపాదించిన మొత్తంలో పెట్టుబడి పోను మిగిలినది ఖర్చు చేయడం ప్రారంభించాలి. చిన్న మొత్తమైనా మదుపు చేసేందుకు సరిపోతుంది. రూ.1,000 చాలు.. కొన్నేళ్లలో రూ. కోటి అయ్యేందుకు. ఎంత త్వరగా మదుపు ప్రారంభిస్తే అంత వేగంగా మన డబ్బు రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలం కొనసాగితేనే చక్రవడ్డీ ప్రయోజనం సిద్ధిస్తుంది. పెట్టుబడుల్లో కొంత నష్టం ఉంటుంది. చేసే ప్రతిపనిలోనూ కొంత కష్టం ఉంటుంది. అలా అని భయపడం కదా.. మదుపూ అంతే. మీ ఆర్థిక స్థితిని బట్టి పథకాలను ఎంపిక చేసుకోవాలి. ‘పదవీ విరమణ వరకూ పనిచేస్తా.. ఆ తర్వాత పిల్లలు, బంధువులు మా బాగోగులు చూస్తారు’ అనే ధోరణి విడనాడాలి. చిన్న కుటుంబాలున్న సమాజంలో మన ఆర్థిక అవసరాలను ఇతరులు పట్టించుకుంటారు అనుకోవడం సరికాదు. మీరు సంపాదించే వయసులోనే పదవీ విరమణ తర్వాత 20-30 ఏళ్ల జీవితం కోసం పెట్టుబడులు పెట్టుకోవాలి. కుటుంబానికి తగిన రక్షణ కల్పించేలా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ తీసుకోవడం మర్చిపోవద్దు.
- జాగర్లమూడి వేణుగోపాల్‌, జెన్‌మనీ
అప్పులపై నియంత్రణతో..

సొంతిల్లు, కారు, పిల్లలకు మంచి విద్య.. ఆర్థిక స్వేచ్ఛను సాధించడం అంటే ఇవే కావు. ఇప్పుడు రుణం తీసుకొని వీటన్నింటినీ తేలిగ్గానే నెరవేర్చుకోవచ్చు. కానీ, తీసుకున్న రుణాలకు వాయిదాలను సకాలంలో చెల్లిస్తున్నామా అనేదే ఇక్కడ ముఖ్యం. అప్పులపై నియంత్రణ సాధించాలి. రుణాలను ఎలా తీరుస్తున్నారన్నది మీ క్రెడిట్‌ నివేదిక తెలియజేస్తుంది. స్వేచ్ఛ అంటే ఒక బాధ్యతతో వస్తుంది. రుణాలు తీసుకునే స్వేచ్ఛ ఉందంటే.. వాటిని సకాలంలో తీర్చాల్సిన బాధ్యతా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోండి. అవసరమైనంత మేరకే అప్పు చేయండి. క్రెడిట్‌ కార్డు పరిమితిని 30 శాతానికి మించి వాడొద్దు. అప్పులు తక్కువగా ఉన్నవారే ఆర్థికంగా స్వాతంత్య్రం సాధించినట్లు అని గుర్తించాలి.
- సుజాతా అహ్లావత్‌,సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌
అర్థం చేసుకుంటూ...

కేవలం సంపాదించడంతోనే ఆర్థిక స్వేచ్ఛ సాధ్యం కాదు. మన అవసరాలు, కోరికలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాటిని సాధించే దిశగా ఒక కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. పెట్టుబడులు, చేస్తున్న రుణాలు అన్నీ మీ లక్ష్యం వైపు మిమ్మల్ని దగ్గరకు చేస్తుండాలి. చిన్న వయసులోనే ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. అప్పుడే సంపాదన పెరుగుతున్న కొద్దీ ఆర్థిక స్వాతంత్య్రం సాధ్యమవుతుంది. రోజులో ఏం చేయాలన్నది ఎలా నిర్ణయించుకుంటారో... దీర్ఘకాలాన్నీ అదే విధంగా ప్రణాళిక వేసుకోవాలి. ఆర్థిక భద్రత అనేది ఆర్థిక స్వేచ్ఛకు తొలి మెట్టు.
- సిద్ధార్థ్‌ మెహతా, ఎండీ-సీఈఓ, ఫ్రీఛార్జ్‌
ఉత్పత్తి రంగంలో...

నవీ మ్యూచువల్‌ ఫండ్‌ మన దేశంలో ఉత్పత్తి రంగానికి చెందిన అగ్రశ్రేణి కంపెనీల్లో మదుపు చేసే వ్యూహంతో ‘నవీ నిఫ్టీ ఇండియా మ్యానుఫాక్చరింగ్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ ఇండియా మ్యానుఫాక్చరింగ్‌ టీఆర్‌: సూచీని ఈ పథకానికి కొలమానంగా తీసుకుంటారు.   ఈ సూచీలో ప్రస్తుతం 79 కంపెనీలున్నాయి. ఇందులో క్యాపిటల్‌ గూడ్స్‌, వాహన, ఆరోగ్య సంరక్షణ, లోహాలు, రసాయనాలు- ఫార్మా రంగాలకు చెందిన అగ్రశ్రేణి కంపెనీలున్నాయి. ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలకు ఈ పథకం దాదాపు 95 శాతం నిధులను ఈక్విటీ షేర్లకు కేటాయిస్తుంది. రుణ పత్రాలకు 5 శాతం వరకూ నిధులు కేటాయించవచ్చు. నిఫ్టీ 100, నిఫ్టీ 150, నిఫ్టీ 50 సూచీల్లోని ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీల పనితీరును విశ్లేషించి, తన పెట్టుబడుల విధానానికి సరిపోయిన కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టడం ఈ పథకం లక్ష్యం.  
మౌలిక కంపెనీల్లో
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి కొత్తగా నిఫ్టీ ఈటీఎఫ్‌ పథకం వచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఈటీఎఫ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 17. కనీస పెట్టుబడి రూ.1,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ప్యాసివ్‌ పథకం. ఫండ్‌ మేనేజర్‌ విచక్షణకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈ పథకం నిబంధనల ప్రకారం పోర్ట్‌ఫోలియోను నిర్మించాలి. మనదేశంలో మౌలిక సదుపాయాల రంగంలో సమీప భవిష్యత్తులో పెద్ద ఎత్తున నూతన అవకాశాలు లభిస్తాయనే నమ్మకం, తద్వారా ఈ రంగానికి చెందిన కంపెనీలు అధిక లాభాలు ఆర్జిస్తాయనే విశ్వాసం ఉన్న మదుపరులు ఈ ఫండ్‌ పథకాన్ని పెట్టుబడి కోసం పరిశీలించవచ్చు. నిఫ్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సూచీలో టెలీకామ్‌, పవర్‌, పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, షిప్పింగ్‌ ప్రాజెక్టులు నిర్వహించే కంపెనీలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని