logo

ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చలేదు

కర్నూలు నగరంలో ఈనెల 5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 04 Feb 2023 03:52 IST

5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర మహాసభ
భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తాం
బొప్పరాజు వెంకటేశ్వర్లు

మాట్లాడుతున్న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో ఈనెల 5న ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఏపీ ఐకాస అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.రావు, అసోసియేట్‌ ఛైర్మన్‌ టి.వి.ఫణివీర్రాజు, కోశాధికారి వి.వి. మురళీకృష్ణ నాయుడు, కో ఛైర్మన్‌ కె.మల్లేశ్వరరావుతో కలిసి కర్నూలులో శుక్రవారం మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత గతేడాది ఫిబ్రవరి 6న చలో విజయవాడ పేరుతో వేలాది మంది ఉద్యోగులు తమ సమస్యలపై మహా ప్రదర్శన నిర్వహించారని.. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఇదే పెద్ద ఉద్యమమని చెప్పారు. ఉద్యోగుల సంఘటితం ద్వారానే ప్రభుత్వం 11వ పీఆర్సీ ప్రకటించిందన్నారు. గతంలో రాయితీలు పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నామని.. కొత్తగా సాధించిందేమీ లేదన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌.. ఇలా అన్నిరకాల ఉద్యోగులు సీఎం జగన్‌ ఇచ్చిన హామీల అమలుకోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారన్నారు. ఏ ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదన్నారు. కొత్త పీఆర్సీలో రెండు, మూడు ప్రధాన డిమాండ్లు కూడా పరిష్కారానికి నోచుకోలేదంటూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సంవత్సరం నుంచి సహకారం అందిస్తూ వచ్చామన్నారు. ఏపీ ఐకాస అమరావతి ఏర్పడి మూడేళ్లు పూర్తి చేసుకుందని, ఈ సందర్భంగా 5వ తేదీన కర్నూలు నగర శివారులోని కర్నూలు-బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న జీఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటరులో మూడో మహాసభను వేలాది మంది ఉద్యోగులతో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాయలసీమ జిల్లాల కార్యవర్గాలు, ఐకాసలో 94 సంఘాల అధ్యక్ష, కార్యదర్శులంతా సమావేశమై అందరితో చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

నేడు నూతన కార్యవర్గ ఎన్నిక

ఏపీ ఐకాస అమరావతి నూతన కార్యవర్గ ఎన్నికలు కర్నూలు నగరంలో శనివారం జరగనున్నాయని బొప్పరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల అధికారిగా ఏపీ సహకార శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భావన రుషి, సహాయ ఎన్నికల అధికారిగా ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ, అదే రోజు రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక పూర్తవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదరరావు, రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, ఐకాస నాయకులు ఈర్ల శ్రీరామ్మూర్తి, గ్రామ సచివాలయ రాష్ట్ర నాయకులు జ్యోతి, సల్మాన్‌ భాషా, వీఆర్‌ఏల సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్రావ్‌, సత్యం, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, సాంబశివరావు  తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని