logo

ముగ్గురు సైబర్‌ నేరగాళ్ల అరెస్టు

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్‌ నవీన్‌కుమార్‌, అతని సోదరుడు అరుణ్‌కుమార్‌, అదే గ్రామానికి చెందిన మహేశ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

Published : 28 Mar 2024 03:16 IST

నిందితులను పట్టుకున్న సీఐడీ అధికారులు, కర్నూలు రెండో పట్టణ పోలీసులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న కర్నూలు మండలం మునగాలపాడుకు చెందిన మాస్టిక్‌ నవీన్‌కుమార్‌, అతని సోదరుడు అరుణ్‌కుమార్‌, అదే గ్రామానికి చెందిన మహేశ్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. నిందితులను కర్నూలు రెండో పట్టణ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. డిగ్రీ వరకు చదివిన నవీన్‌కుమార్‌ మెడికల్‌ రెప్‌గా పనిచేసేవాడు. దురాశతో సైబర్‌ నేరానికి తెరలేపాడు. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఎస్‌ఏ ట్రేడింగ్‌ కంపెనీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రమణ నాగ్‌పాల్‌ వ్యవహరిస్తున్నారని.. ఇందులో పెట్టుబడి పెడితే ప్రతి నెలా కొంత మొత్తం ఖాతాల్లో జమవుతుందని తెలిసినవారికంతా చెప్పి ప్రచారం చేస్తూ లింకులు పంపేవాడు. తన స్నేహితురాలైన మాధురి ద్వారా పరిచయమైన జంగం వీరలక్ష్మిని నమ్మించటంతో ఆమె పలు దఫాలుగా రూ.4.87 లక్షలు పెట్టుబడి పెట్టింది. తర్వాత సైటు ఓపెన్‌ కాకపోవటంతో ఆమె పలుమార్లు ప్రశ్నించగా ఏవేవో కారణాలు చెప్పి కాలం వెళ్లదీసేవాడు. ఇతని తమ్ముడు అరుణ్‌కుమార్‌, స్నేహితుడు మహేష్‌ సాయంతో ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంటుపై ప్రచారం చేయించి దాదాపు 40 మంది ద్వారా పెట్టుబడి పెట్టించి తన ఖాతాలో జమ చేయించుకుని చివరికి చేతులెత్తేశాడు. మోసపోయినట్లు గ్రహించిన జంగం వీరలక్ష్మి కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీ అధికారులకు అప్పగించారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు ప్రధాన నిందితుడు నవీన్‌కుమార్‌గా గుర్తించారు. అతనికి సహకరించిన అరుణ్‌, మహేష్‌ను అరెస్టు చేసి కర్నూలు రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. సీఐడీ డీఎస్పీ దైవప్రసాద్‌, సైబర్‌ క్రైమ్‌ అనాలసిస్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ సీఐ నవీన్‌బాబు, ఎస్సై బందెసాహెబ్‌, సిబ్బందిని సీఐడీ విభాగాధిపతి సంజయ్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు. కచ్చితమైన సమాచారం లేని ఆన్‌లైన్‌ లింకు బిజినెస్‌లను నమ్మి మోసపోవద్దని, తొందరపడి లింకులు ఓపెన్‌ చేయొద్దని సీఐడీ అధికారులు సూచించారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930కుగానీ, స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్‌ నేరాల బాధితుల కోసం సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఏపీ సైబర్‌ క్రైమ్‌ కో ఆర్డినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి 75 మందిని నియమించారన్నారు. 


అప్పుల బాధతో రైతు బలవన్మరణం  

దిద్దికాటి అర్జునుడు (పాతచిత్రం)

గోనెగండ్ల, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామానికి చెందిన రైతు దిద్దికాటి అర్జునుడు (43) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు గోనెగండ్ల సీఐ రామకృష్ణయ్య తెలిపారు. ఆయనకు 3.14 ఎకరాల పొలం ఉంది. భార్య పద్మావతితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహానికి రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల బెడదతో పంటలు పూర్తిగా దెబ్బతినడంతో మరో రూ.2 లక్షలు అప్పులయ్యాయి. రెండేళ్లుగా పంటలు చేతికందకపోవడం, అప్పులవారి ఒత్తిడి తట్టుకోలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


విద్యుదాఘాతంతో ఒకరి మృతి

నాగరాజు (పాతచిత్రం)

కె.శింగవరం (సి.బెళగల్‌), న్యూస్‌టుడే: మండలంలోని కె.శింగవరం గ్రామానికి చెందిన నాగరాజు (48) మంగళవారం రాత్రి విద్యుదాఘాతంలో మృతి చెందారు. నాగరాజు కె.శింగవరం నుంచి పల్దొడ్డిలో ఓ రైతు పొలంలో మిరపకాయలు తెంపేందుకు బొలెరో వాహనంలో బయలుదేరారు. వాహనం టాప్‌పై కూర్చుని వెళ్తుండగా పైభాగంలోని విద్యుత్తు తీగలు మెడకు తగిలి విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజుకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీపీఎం మండల నాయకుడు కె.మోహన్‌ కె.శింగవరం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


నా కుమార్తెను చంపేశారు

ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : తన కుమార్తె మల్లేశ్వరిని అల్లుడు కె.చిన్నవీరన్న, అతని ముగ్గురు సోదరులు చంపేశారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పెద్దకడబూరు మండలం హెచ్‌.మురవనికి చెందిన కురువ భాస్కర్‌ విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డికి చెందిన చిన్నవీరన్నతో తన కుమార్తె పెళ్లి జరిగిందని, రూ.లక్ష నగదు, ఐదు తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చామని చెప్పారు. అల్లుడు రోజూ తాగివచ్చి తన కుమార్తెను హింసించేవాడని.. పలుమార్లు పంచాయితీ చేసినా మారలేదన్నారు. చివరికి తన కుమార్తెను చిన్నవీరన్న, అతని సోదరులు చంపేశారని, ఎమ్మిగనూరు పోలీసులు కేసు నమోదు చేసినా న్యాయం జరగలేదన్నారు. మల్లేశ్వరి పిల్లలను తమ వద్దే ఉంచుకుని చదివిస్తున్నామని, ఆస్తి వాటా ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో పిల్లలను చంపేయత్నం చేశారన్నారు. పిల్లలకు భద్రత కల్పించి న్యాయం చేయాలని కోరారు.


కారు, బొలెరో ఢీకొని విద్యార్థి దుర్మరణం

ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని బనవాసి ఫారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం బొలెరో ట్రాలీ వాహనం, కారు ఢీకొన్న ప్రమాదంలో సందీప్‌ (16) అనే విద్యార్థి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు గ్రామీణ ఎస్సై శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదోనికి చెందినవారు బొలెరో వాహనంలో పెళ్లి కుమారున్ని చూసేందుకు ఎమ్మిగనూరు వైపు వస్తుండగా మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారు ఢీకొంది. బొలెరోలోని సందీప్‌ ఎగిరి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. బాలుడు 6వ తరగతి చదువుతున్నాడు. కేసు నమోదు చేసినట్లు గ్రామీణ ఎస్సై చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని