logo

గద్వాలపై వరాల జల్లు

జిల్లాపై ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ వరాల జల్లు కురిపించారు. గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలు, పురపాలికల అభివృద్ధికి  నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Published : 13 Jun 2023 05:03 IST

స్థానిక సంస్థలకు భారీగా నిధుల కేటాయింపు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుడిగాలి పర్యటన

ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, మహబూబ్‌నగర్‌ - గద్వాల, గద్వాల పురపాలకం, న్యూస్‌టుడే: జిల్లాపై ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ వరాల జల్లు కురిపించారు. గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలు, పురపాలికల అభివృద్ధికి  నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 మండలాలు, నాలుగు పురపాలికలు ఉన్నాయన్నారు. మొదటిసారి గద్వాలకు వచ్చిన కాబట్టి ప్రతి గ్రామానికి ప్రత్యేకమైన గ్రాంటు రూ.10 లక్షలు, మండల కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ఒక్కో మండలానికి రూ.15 లక్షలు ప్రకటించారు. గద్వాల పురపాలికలకు రూ.50 కోట్లు, మిగతా పురాలకు ఒక్కోదానికి రూ.25 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో నూతన కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, భారాస కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో మంత్రులిద్దరూ శ్రీనివాస్‌గౌడ్‌,  నిరంజన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారులేనని, వారు వేర్వేరు రూపాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. నిరంజన్‌రెడ్డి క్షేత్రస్థాయిలో, శ్రీనివాస్‌గౌడ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగాన్ని లెక్కచేయకుండా ఉద్యమం చేశారన్నారు. వీరిద్దరే కాకుండా డా లక్ష్మారెడ్డి, చాలా సీˆనియర్లు పాలమూరులో ఉద్యమకారులు ఉన్నారు. వీరందరూ ఉండటం వల్లే పాలమూరు ఐదు జిల్లాలుగా ఏర్పడిందన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మీ అభివృద్ధి కోసం నా దగ్గరకు వచ్చి పంచాయితీ పెడతారన్నారు. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం వంద పడకల ఆస్పత్రికి ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు.  

ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎం కేసీఆర్‌

మొదటగా పార్టీ కార్యాలయం.. : జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో నూతనంగా నిర్మించిన భారాస క్యాంపు కార్యాలయాన్ని సీఎం కేసీˆఆర్‌ ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత పార్టీ జెండాను ఎగరేశారు. మాజీ ఎమ్మెల్యే గట్టుభీముడు వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి సీˆఎం పూల మాలలు వేసి నివాళులర్పించారు. పూజల అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని సీటులో కూర్చోబెట్టారు. అనంతరం కేసీˆఆర్‌ స్టడీ సర్కిల్‌ను పరిశీలించి నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. నిరుపేదల చదువులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ స్టడీ సర్కిల్‌ను ఇలాగే కొనసాగించి నిరుద్యోగులకు బాసటగా నిలబెట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్‌అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎంపీˆ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, డా.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌.రాజేందర్‌రెడ్డి, బి.హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, సాయిచంద్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఛైర్మన్‌ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీఛైర్మన్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.  

* కేసీఆర్‌ బహిరంగ సభలో కేవలం 12 నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్లడంతో పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.  సీఎం ఎక్కడ బహిరంగ సభలో పాల్గొన్నా సుమారు 30 నిమిషాలకుపైగానే ప్రసంగించారు. అందుకు విరుద్ధంగా 12 నిమిషాల్లో సభ ముగించి వెళ్లడం, ప్రసంగంలోనూ పాత విషయాలే ఉండటంతో కార్యకర్తలు, నేతలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం హెలీకాప్టర్‌లో వచ్చి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంది. చివరి నిమిషంలో హెలీకాప్టర్‌లోనే వెళ్లేలా షెడ్యూల్‌ను మార్చినట్లు సమాచారం. చీకటి అవుతుండటంతో ప్రసంగాన్ని కుదించి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నిమిషం కూడా మాట్లాడలేదు. తనను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతో కేసీˆఆర్‌ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినట్లు వెల్లడించారు.

ప్రగతి నివేదన సభకు హాజరైన జనం


* గద్వాలలోని పీజేపీ క్యాంపులో రూ.38.5 కోట్లతో నిర్మించిన ఎస్పీ నూతన కార్యాలయ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం ఎస్పీ సృజనను కుర్చీలో కూర్చోబెట్టి ప్రత్యేక అభినందనలు తెలిపారు.


* అనంతరం కేసీఆర్‌ ఐడీవోసీ కార్యాలయానికి చేరుకుని నూతన కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ క్రాంతిని కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఐడీవోసీˆ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న రోడ్లు, భవనాల శాఖ అధికారులు, సిబ్బందిని కేసీˆఆర్‌ సన్మానించారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి గ్రూపు ఫొటో దిగారు. అనంతరం బహిరంగ సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి వారితో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని