logo

కరకట్ట ఎత్తు పెంపు కలేనా?

రెండు రాష్ట్రాల సరిహద్దుగా సుంకేసుల జలాశయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదకర ప్రదేశాలు, రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

Published : 17 Apr 2024 05:41 IST

రెండు మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న కరకట్ట

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే: రెండు రాష్ట్రాల సరిహద్దుగా సుంకేసుల జలాశయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఎక్కడ చూసినా ప్రమాదకర ప్రదేశాలు, రహదారులు అధ్వానంగా ఉన్నాయి. రాజోలి గ్రామానికి ఆనుకొని ఉన్న జలాశయం కరకట్ట 2009లో వచ్చిన వరదల కారణంగా పూర్తిగా తెగిపోయింది. ఆ కట్ట తెగిపోవడంతో అప్పట్లో నీరంతా గ్రామాన్ని ముంచెత్తి, ప్రజలందరినీ రోడ్డున పడేసింది. ప్రభుత్వం అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మించింది. అయితే.. జలాశయం గేట్లను పెంచాలనే ఉద్దేశంతో రెండున్నర మీటర్ల తక్కువ ఎత్తులోనే కరకట్ట నిర్మించారు. ఆ సమయంలో ప్రజలు దీనిని వ్యతిరేకించినా ప్రజాప్రతినిధులు హామీలు గుప్పించి పనులు కానిచ్చారు. తిరిగి ఇప్పటి వరకు కరకట్ట నిర్మాణంపై దృష్టి సారించడం లేదు.

రహదారులు అధ్వానం..: నిత్యం వాహనాల రాకపోకలు.. తరచూ పర్యాటకుల సందడి ఉండే సుంకేసుల జలాశయం రహదారులు అధ్వానంగా ఉన్నాయి.. పర్యాటకులు ప్రమాదకరంగా డ్యాం వీక్షించాల్సిన దుస్థితి. కిలోమీటరున్నర ఉన్న కరకట్టపై ప్రయాణం చేయాలంటే దుమ్ము, గుంతలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు రక్షణ దిమ్మెలు లేక ప్రమాదకరంగా ఉంది. ఇక దిగువ కరకట్ట కోతకు గురై ప్రమాదకరంగా మారింది. వీటితో పాటు, డ్యాం సర్కిల్‌ వద్ద ముళ్లపొదలు పెరిగి ఆహ్లాదం కరవైంది. వచ్చిన పర్యాటకులు కూర్చోవడానికి కనీసం స్థలం కరవైంది. డ్యాం ఎగువ, దిగువ ప్రాంతాల్లో వీక్షించేందుకు ఎలాంటి రక్షణ కడ్డీలు లేవు. డ్యాం రహదారిలోనే పాదచారులు నడిచే చోట రక్షణ దిమ్మెలేదు. దానికి సన్నటి తీగతో రక్షణ ఏర్పాటు చేశారు. ఇది ప్రమాదకరంగా ఉంది. సందర్శకులు నది లోతులకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు. లోతును గమనించక ఎంతో మంది యువకులు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. అయినా అలాంటి ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేయలేదు. డ్యాం అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు గతంలోనే పంపామని జేఈ రాజు అంటున్నారు.

డ్యాం రహదారిలో ఏపుగా పెరిగిన ముళ్లపొదలు

15 ఏళ్లుగా..: ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా.. కరకట్ట ఎత్తు పెంపును పట్టించుకోవడం లేదు. దీంతో జలాశయం నిండు కుండలా ఉన్నప్పుడు, ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చినప్పుడల్లా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం నదిలో నీరు లేకపోవడంతో పనులు చేపట్టేందుకు అనువైన సమయమని, ఈ దిశగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని