logo

తెలంగాణను భారాస లూటీ చేసింది: మంత్రి

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్‌తో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

Published : 18 Apr 2024 04:10 IST

గద్వాల పాతబస్టాండ్‌ వద్ద మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిత్రంలో మల్లు రవి, సంపత్‌కుమార్‌, సరిత, బీఎస్‌ కేశవ్‌

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మిగులు బడ్జెట్‌తో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. భారాస లూటీ చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బుధవారం రాత్రి గద్వాల పాత బస్టాండ్‌లో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సరిత అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. నాగర్‌ కర్నూల్‌ లోకసభ అభ్యర్థిగా భారాస నుంచి పోటీ చేయనున్న ప్రవీణ్‌కుమార్‌, గతంలో దళితులకు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేశారని తిట్టి, కాడి వదిలివేసి కారు ఎక్కారని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి భారాస ఎందులోనూ కాంగ్రెస్‌ పార్టీకి పోటీ పడలేదన్నారు.

పెండింగ్‌ పనులన్నీ పూర్తి చేయిస్తా

గట్టు, ధరూరు, కేటీదొడ్డి, న్యూస్‌టుడే: జిల్లాలో దశాబ్దకాలంగా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తిచేయిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గట్టులో బుధవారం లోక్‌సభ కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సరిత స్వల్ప మెజార్టీతో ఓటమి పాలవటం విచారకరమని, ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆ లోటును పూడ్చి అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరారు. రెండుసార్లు పార్లమెంటు సభ్యునిగా ఉన్నందున నియోజకవర్గ పరిస్థితులన్నీ తెలుసని, ఈ సారి ఎన్నికల్లో ఆదరిస్తే అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని పార్టీ అభ్యర్థి మల్లు రవి తెలిపారు.

  • సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారెంటీలను అమలు చేయాలంటే రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ఎంపీ అభ్యర్థి మల్లు రవి అన్నారు. ధరూరు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి జూపల్లితో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేర్చుకుంటూ వస్తోందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
  • పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే గద్వాల నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. మల్లురవితో కలిసి కేటీదొడ్డిలో ప్రచార సభలో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు 50 శాతానికి పెంచి బోయలకు ఏస్టీ జాబితాలో చేరుస్తామన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ సరిత, ఎఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, నాయకులు గట్టు తిమ్మప్ప, మధుసూదన్‌ బాబు, గోవర్ధన్‌ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని