logo

నాకింత... నీకింత

గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్‌ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్‌ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు.

Updated : 19 Apr 2024 06:41 IST

రక్తపరీక్ష కేంద్రాలతో కొందరు పీఎంపీల ఒప్పందం
అధిక వసూళ్లతో నలిగిపోతున్న రోగులు
న్యూస్‌టుడే-నారాయణపేట

పేట జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొంతమంది రోగులకు సంబంధించి ప్రయివేటులో రక్త పరీక్షలు చేసుకున్నట్లు ఇటీవల ఆకస్మిక సందర్శనకు వెళ్లిన కలెక్టర్‌ శ్రీహర్ష దృష్టికి వచ్చింది. అసలు ప్రైవేటుగా రక్త పరీక్షలు ఎందుకు చేయిస్తున్నారని వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


రెండు రోజుల కిందట ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు.  పరీక్షించిన వైద్యుడు హెర్నియా ఆపరేషన్‌కు సంబంధించి ఏవేవో రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రంలో వైద్యుడు సూచించిన పరీక్షలన్నింటికీ ఏకంగా రూ.3500ల ఫీˆజు చేశారు. బిల్లు చూసిన ఆ వ్యక్తి  నిట్టూర్చాడు.. నారాయణపేటతోపాటు ప్రధాన పట్టణాల్లోని పలు ప్రయివేటు రక్త పరీక్ష కేంద్రాలలో వసూళ్ల దందా కొనసాగుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలతోపాటు టైఫాయిడ్‌ ఇతరత్రా వ్యాధుల భారినపడిన ప్రజలు తరచూ వైద్యం కోసం మండల, డివిజన్‌ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా ముందుగా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిందేనని సూచిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు కేంద్రాల నిర్వహకులు అధిక వసూళ్లకు తెగబడుతున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడిన కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు అనవసర పరీక్షలకు పురమాయిస్తున్నారు.

జిల్లాలో నారాయణపేట పెద్ద ఆస్పత్రి, మూడు క్లస్టర్‌ హెల్త్‌ కేంద్రాలు, 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్‌హెల్త్‌ కేంద్రం ఉంది. వీటితోపాటు 59 పల్లెదవాఖానాలు, మరో 28 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురైనా, ఏదైనా వ్యాధిబారిన పడినా ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తుండగా ప్రైవేటు ఆస్పతుల్రకు అంతేస్థాయిలోనూ వెళ్తున్న పరిస్థితి. రోగి వ్యాధి నయం కోసం వివిధ రక్తపరీక్షలు చేయనుండటంతో ప్రైవేటు రక్త పరీక్షల కేంద్రాల నిర్వహకులు ఆడిందే ఆటగా తయారయ్యింది.

ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రాల్లో ఫీజుల వసూళ్లపై  అజమాయిషీ పూర్తిగా కొరవడటంతో దందా కొనసాగుతోంది..వాస్తవానికి మలేరియా, టైఫాయిడ్‌, ప్లేట్‌లెట్ల పరీక్షలను వైద్యుల సూచన మేరకు చేయాల్సి ఉంటుంది. వీటికి పెద్దగా ఖర్చుకాదని రూ.400ల వరకు ఉంటుందని, బయటి రక్త పరీక్ష కేంద్రాలలో మాత్రం అదనంగా వసూలు చేస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.

కానరాని ధరల పట్టిక..

నారాయణపేటలో 21,  కోస్గిలో 12, మక్తల్‌లో 10 రిజిస్టరైన రక్త పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు అనుమతిలేనివి మరిన్ని కొనసాగుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు సీబీపీ పరీక్ష రూ.200, మలేరియా రూ.200లు, హెచ్‌ఐవీ రూ.300లు, మధుమేహం రూ.100లు, థైరాయిడ్‌ రూ.500, బ్లడ్‌ కల్చర్‌ రూ.1800, యూరిన్‌ కల్చర్‌ రూ.600, తెమడ, సెమిన్‌ కల్చర్‌ రూ.600ల చొప్పున, సర్జికల్‌ ప్రొఫైల్‌ రూ.2800ల ఇలా ఒక్కో పరీక్షకు ధరను నిర్ణయించి అమలుచేస్తున్నారు.ఏ కేంద్రాంలోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టిక ప్రదర్శించడం లేదు. కొన్ని కేంద్రాల్లో ఎవరికీ కనిపించని చోట పట్టిక పెడుతున్నారు.

అక్కడికే పంపిస్తారు

జిల్లా వ్యాప్తంగా కొందరు ఆర్‌ఎంపీ, పీఎంపీలతోపాటు వైద్యసిబ్బంది తమ వద్దకు వచ్చిన రోగులను ప్రైవేటు రక్త పరీక్ష కేంద్రాలకు వెళ్లేలా చూస్తున్నారు. వీరే కాదు.. జిల్లా కేంద్రంలో ఆస్పత్రికి వచ్చిన రోగులకు కొందరు సిబ్బంది ప్రయివేటుగా రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ పర్సంటేజీలు పొందుతున్నారు.. ఇలా గత కొన్ని నెలలుగా తతంగం కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ వ్యాపారం కొనసాగుతోంది.


అధిక ఫీజులు వసూలుచేస్తే చర్యలు...

- డా.సౌభాగ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో నారాయణపేట

జిల్లాలోని ప్రయివేటు రక్త పరీక్ష కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు వసూలు చేయాలి. ఇష్టానుసారంగా పరీక్షల పేరుతో అధికంగా వసూలు చేయకూడదు. ఎక్కడైనా రోగుల నుంచి అధికంగా ఫీజులుచేస్తే శాఖాపరంగా చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని