logo

తుది దశలో సమీకృత కలెక్టరేట్‌ భవనం

అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి పాలన చేపట్టేలా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలో అటు సమీకృత, ఇటు జిల్లా పోలీసు కార్యాలయం సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్‌లో సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మెదక్‌ పట్టణ కేంద్రంగా 2016, అక్టోబరులో జిల్లా ఆవిర్భవించింది. స్థానిక పిల్లికొట్టాల్‌లోని ఓ ప్రైవేట్‌ భవనంలో ప్రస్తుతం సమీకృత కలెక్టరేట్‌ కొనసాగుతోంది. నెలకు వేలాది రూపాయాల్లో అద్దె చెల్లిస్తున్నారు.

Published : 05 Feb 2022 01:59 IST

ప్రహరీ, అంతర్గత రహదారులు నిర్మిస్తే అందుబాటులోకి..

న్యూస్‌టుడే, మెదక్‌

అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చి పాలన చేపట్టేలా సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన జిల్లాలో అటు సమీకృత, ఇటు జిల్లా పోలీసు కార్యాలయం సైతం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్‌లో సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మెదక్‌ పట్టణ కేంద్రంగా 2016, అక్టోబరులో జిల్లా ఆవిర్భవించింది. స్థానిక పిల్లికొట్టాల్‌లోని ఓ ప్రైవేట్‌ భవనంలో ప్రస్తుతం సమీకృత కలెక్టరేట్‌ కొనసాగుతోంది. నెలకు వేలాది రూపాయాల్లో అద్దె చెల్లిస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈమేరకు మెదక్‌- రామాయంపేట ప్రధాన రహదారి పక్కన ఔరంగబాద్‌ శివారులోని సర్వే నెం.78లో 32 ఎకరాలను సమీకృత కలెక్టరేట్‌కు కేటాయించారు. 2018, మే 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే ఏడాది అక్టోబరులో నిధులు మంజూరు కావడంతో పనులు షురూ చేశారు.


33 శాఖలకు....


నిర్మాణంలో ఉన్న అప్రోచ్‌ రోడ్డు

ప్రస్తుతం నిర్మిస్తున్న నూతన భవనంలో పాలనాధికారి, అదనపు పాలనాధికారుల ఛాంబర్లతో పాటు సమావేశం గది, వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ ఉన్నాయి. వీటితో పాటు మొదటి, రెండో అంతస్థులో గదులను నిర్మించారు. వాటిని 33 ప్రభుత్వ శాఖలకు కేటాయించనున్నారు. ప్రస్తుతం రంగులు, ఫాల్‌సీలింగ్‌, విద్యుదీకరణ పనులను చేపడుతున్నారు. పాలనాధికారి, అదనపు పాలనాధికారులకు నివాసగృహాలను నిర్మించారు. జిల్లా శాఖల అధికారులు నివసించేలా రెండు భవనాలను సిద్ధం చేశారు. ఒక్కో భవనంలో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. అన్ని భవనాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. మరోవైపు మెదక్‌-రామాయంపేట మార్గం నుంచి కార్యాలయంలోకి వచ్చేందుకు అప్రోచ్‌ రోడ్డు నిర్మిస్తున్నారు.


జిల్లా అధికారుల నివాస సముదాయం


మిగిలిన పనులకు ప్రతిపాదనలు...


పాలనాధికారి అధికారిక నివాస భవనం

సమీకృత కలెక్టరేట్‌ చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీ రహదారులు, వీధిదీపాలు, భూగర్భ మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. ఇందుకు రూ.13 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మెదక్‌ పర్యటన ఉంటుందని, ఆలోగా భవనం పనులు పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని నిర్మాణ సంస్థకు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించినట్టు సమాచారం. ‘సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణానికి సంబంధించి సివిల్‌ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది మెరుగులు చేస్తున్నారు. ఇది వరకు మంజూరైన నిధులతో సీసీ రహదారులు, ప్రహరీ పూర్తిస్థాయిలో చేపట్టాలని, అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించలేదు. మిగిలిన పనులకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైతే పనులను చేపడుతాం’ అని మెదక్‌ ఆర్‌అండ్‌బీ డీఈఈ వెంకటేశం పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని