logo

పదోన్నతులు లేక నిరాశ

భాషా పండితులు అనేక సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేడుతుండటంతో వారికీ పదోన్నతి వస్తుందని భావించారు.

Published : 06 Feb 2023 01:45 IST

భాషా పండితుల నిరసన పథం
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపలిటీ

సంగారెడ్డిలో నినాదాలు చేస్తూ..

భాషా పండితులు అనేక సంవత్సరాలుగా ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్నారు. 8 సంవత్సరాల తరువాత ప్రభుత్వం ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ చేడుతుండటంతో వారికీ పదోన్నతి వస్తుందని భావించారు. అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. గతంలో భాషా పండితులను అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా అమలు చేయలేదు. ప్రస్తుతమూ ఆ ప్రక్రియ చేపట్టకపోవడంతో భాషా పండితులు నిరసన తెలుపుతున్న తీరుపై కథనం.

462 మంది ఎదురుచూపు

జిల్లాలో 462 మంది భాషోపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరు ఎస్జీటీలుగా బోధన చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు మాత్రమే బోధించాలి. స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, హిందీ పోస్టులు ఖాళీగా ఉండడంతో 9, 10 తరగతులకూ.. వీరితో బోధన చేయిస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్లతో సమానంగా పాఠశాలలో సేవలందిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా పదోన్నతి రాకపోవడంతో నష్టపోతున్నారు. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలప్పుడు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా పదోన్నతులపై హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. వీరితో పాటే విధుల్లో చేరిన ఇతర ఎస్జీటీలు ఇప్పటికే రెండు సార్లు పదోన్నతి పొందినా..భాషోపాధ్యాయులను పట్టించుకోలేదు. 20-25 సంవత్సరాలుగా ఒక్క సారైనా పదోన్నతి పొందకుండా అదే కేడర్‌లో కొనసాగుతున్నారు. పీఈటీలదీ ఇదే పరిస్థితి. వారిని అప్‌గ్రేడ్‌ చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కాలేదు. వీరు ఉన్నత పాఠశాలల్లో పీడీలతో సమానంగా విద్యార్థులకు సేవలందిస్తున్నారు. జిల్లాలో పీఈటీలు 122 మంది పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు.
9,10 తరగతులకు సహాయ నిరాకరణ: పదోన్నతులు కల్పించాలని కోరుతూ భాషా పండితులు నిరసన పథాన్ని ఎంచుకున్నారు. ఐకాసను ఏర్పాటు చేసుకొని.. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి నిబంధనల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే బోధిస్తున్నారు. 9, 10 తరగతులకు బోధన చేయకుండా.. సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి విన్నవించారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.


న్యాయం చేసే వరకు ఆందోళనలు
- చంద్రమోహన్‌, భాషా పండితుల ఐకాస ప్రతినిధి

భాషా పండితులు 20 సంవత్సరాలుగా పని చేస్తున్నా.. ఒక్కసారైనా పదోన్నతి కల్పించలేదు. అందరికీ అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వం తమను విస్మరించడం అన్యాయం. ఎస్జీటీ కేడర్‌లో నియమితులైనా.. స్కూల్‌ అసిస్టెంట్లతో సమానంగా ఉన్నత పాఠశాలల్లో బోధన చేస్తున్నాం. న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని