logo

మైదానం.. వసతులు కనం!

గ్రామీణ యువతను ఆటల్లో ప్రోత్సహించాలని సర్కారు సంకల్పించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

Published : 09 Feb 2023 01:59 IST

న్యూస్‌టుడే, చేగుంట

చేగుంట మండలం బోనాలలో బోర్డు ఒక చోట.. స్థలం మరోచోట

గ్రామీణ యువతను ఆటల్లో ప్రోత్సహించాలని సర్కారు సంకల్పించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో క్రీడాప్రాంగణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో వసతులు లేక వెలవెలబోతున్నాయి.  జిల్లా వ్యాప్తంగా 469 ఏర్పాటు చేయాలని ఇందులో 300 వరకు పూర్తయ్యాయి. ఒక్కోదానికి రూ.2.60 లక్షలు ఖర్చు చేశారు. అయినా చాలా గ్రామాల్లో వసతులు కల్పించలేదు. ముఖ్యంగా స్థల సమస్య ఉండటంవల్ల ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఎక్కడైనా స్థలం గుర్తిస్తే కేవలం బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. ఆటలపై ఆసక్తి ఉన్న యువత తమకు అనువైన స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణలోనే వీటిని ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. చేగుంట, నార్సింగి మండలాల్లో గతేడాది జూన్‌లో వీటిని ఏర్పాటు మొదట్లో మండలానికి రెండు చొప్పున ఏర్పాటు చేయాలని భావించినా, గ్రామానికి ఒకటి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఉపాధి హామీ పథకంలో ఒక్కో దానికి రూ.2.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. కాని చాలా చోట్ల తూతూ మంత్రంగా ఏర్పాటు చేసి మమ అనిపించారు.

అనువుగాని చోట

మైదానాలను అనువుగా లేని చోట ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో స్థల సమస్య ఉండటంతో ఎక్కడ మూడు, నాలుగు గుంటల స్థలం ఉన్నా అందులో ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీ పాలకవర్గం ఇష్టం వచ్చిన చోట ఏర్పాటు చేస్తోంది. చేగుంట మండలం బోనాలలో రైతు వేదిక వద్ద ఓ పక్కన బోర్డు ఏర్పాటు చేసి వదిలేశారు. బోర్డు ఒక చోట, స్థలం మరో చోట ఉంది. ఇందులో వ్యాయామం చేసే బార్‌లు, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో కోర్టులను ఏర్పాటు చేయలేదు.

మక్కరాజుపేటలో అధ్వానంగా..

పేరుకు మాత్రమే

నార్సింగి మండలం భీంరావుపల్లిలో పేరుకు మాత్రం బోర్డు ఉంది. చేగుంట మండలం మక్కరాజుపేటలో రాళ్లు, పొదల్లో ఏర్పాటు చేశారు. బోర్డుతో పాటు వ్యాయామం చేసే బార్‌తో పాటు మిగతా వాటిని అమర్చారు. కాని ఇందులో ఏమాత్రం ఆటలు ఆడేందుకు వీలులేకుండా ఉంది. ప్రస్తుతం చేగుంట ఆదర్శ పాఠశాల ఎదురుగా విశాలమైన స్థలంలో ఏర్పాటు చేసి వినియోగంలోకి తెచ్చారు. కొన్ని చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేపడుతుండటంవల్ల బిల్లులు రావటంలేదని అందువల్ల వాటిని పూర్తిచేయటంలో ఇబ్బంది ఎదురవుతోందని అధికారులు పేర్కొంటున్నారు. దీనివల్లే సర్పంచులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

త్వరలో వసతులు కల్పిస్తాం: విరోధిని, అదనపు డీఆర్డీవో

క్రీడాకారులు సాధన చేసేందుకు మైదానాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా కార్యాచరణ ప్రారంభించాం. త్వరలో నిధులు విడుదల కానున్నాయి. రాగానే వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకువస్తాం.కొన్ని చోట్ల స్థల సమస్య ఉంది. దీనిని అధిగమిస్తాం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు