logo

ఎక్కడి నుంచో తెచ్చి.. ఇక్కడ వదిలేసి

జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నకోతులు, శునకాలను పట్టుకుని నర్సాపూర్‌ అడవులకు తరలిస్తున్నారు. వాటికి ఆహారం లభించక పట్టణంలోకి మందలుగా ప్రవేశించి దాడులు చేస్తున్నాయి.

Published : 21 Mar 2023 02:17 IST

అడవిలో పెరిగిన కోతులు శునకాల సంఖ్య

నర్సాపూర్‌లో ఓ ఇంటి వద్ద మర్కటాలు

న్యూస్‌టుడే, నర్సాపూర్‌: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్నకోతులు, శునకాలను పట్టుకుని నర్సాపూర్‌ అడవులకు తరలిస్తున్నారు. వాటికి ఆహారం లభించక పట్టణంలోకి మందలుగా ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. మరోవైపు గ్రామ సింహాలు వీధుల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దాడులకు దిగడంతో పాటు, పట్టణ వాసులకు రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల ఎక్కడి నుంచో కొందరు వాహనంలో శునకాలను అటవీ ప్రాంతంలో వదిలి వెళ్లారు. అవి ఆహారం కోసం ప్రధాన రహదారుల్లో వెళుతూ ప్రమాదాల బారిన పడ్డాయి. నర్సాపూర్‌ నుంచి గుమ్మడిదల వరకు పది వరకు మృతి చెందాయి.

ఇళ్లలోకి ప్రవేశించి

ఎంతోమంది కోతుల చేతికి చిక్కి గాయాలపాలయ్యారు. కొందరు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలున్నాయి. ఇక ఇళ్లలోకి ప్రవేశించి సామగ్రిని చిందర వందర చేస్తున్నాయి. నల్లాల పైపులు ధ్వంసం చేస్తున్నాయి. మందలుగా ఉన్న సమయంలో ఎవరైనా వాటిని తరిమే ప్రయత్నం చేస్తే,  ఒక్కసారిగా పైన పడి గాయపరుస్తున్నాయి.

రోజూ 20 మందికిపైగా..

నర్సాపూర్‌ ప్రాంతీయ ఆసుపత్రికి రోజూ 20మందికి పైగా కుక్కలు, కోతుల బారిన పడివారు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమైపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆసుపత్రిలో ఏఆర్‌వీ ఇంజక్షన్ల వినియోగం అధికంగా ఉండటమే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా అటవీ, పురపాలిక అధికారులు సమన్వయంతో వ్యవహరించి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇలా చేస్తే మేలు..

* నర్సాపూర్‌లో ఎనిమల్‌ బర్త్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి, వాటికి పునరావాసం కల్పించడంతోపాటు, సంతతిని తగ్గించేందుకు శస్త్రచికిత్స చేయాలి.  

* అడవుల్లో ఫలసాయాన్ని ఇచ్చే మొక్కలను పెంచాలి.

* బయటి ఆహారాన్ని కోతులకు వేయకుండా బోర్డులు ఏర్పాటు చేయాలి.

* ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించకుండా శివార్లలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి

* ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాలి.


ఖర్చుతో కూడిన పని
- వెంకట్‌గోపాల్‌, పుర కమిషనర్‌, నర్సాపూర్‌

కోతులను పట్టించడం పురపాలికకు ఖర్చుతో కూడిన పని. గతంలో ఒకదాన్ని పట్టేందుకు రూ.350 చెల్లించాం. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌కు తరలించాక, వాటి శస్త్రచికిత్స, నిర్వహణకు రూ.850 చెల్లించాం. పట్టణంలో వేలకొద్ది ఉన్నాయి.


ప్రత్యేక నిఘా పెట్టాం
- అంబర్‌సింగ్‌, అటవీ క్షేత్రాధికారి

నర్సాపూర్‌ అడవిలోకి ఇతర ప్రాంతాల నుంచి కుక్కలు, కోతులను తరలించకుండా పాలనాధికారి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. నలుగురు సిబ్బందితో అటవీ మార్గంలో పర్యవేక్షిస్తున్నాం. ఎవరైనా ఆహారం వేసినా, ఇతరత్రా తరలించినా కేసులు నమోదు చేయడంతోపాటు, జరిమానా విధిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు