logo

పాలన కార్యరూపం.. పథకాలకు శ్రీకారం

మెదక్‌.. జిల్లా కేంద్రం కావాలన్నది ఈ ప్రాంతీయుల ఎన్నో ఏళ్ల కల.. ఎట్టకేలకు స్వరాష్ట్రం వచ్చాక పాలనా సౌలభ్యానికి ప్రభుత్వం మెదక్‌ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుచేసిన విషయం విదితమే.

Published : 23 Aug 2023 01:32 IST

మెదక్‌లో కొలువుదీరిన సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయం
నేడు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
న్యూస్‌టుడే, మెదక్‌

మెదక్‌.. జిల్లా కేంద్రం కావాలన్నది ఈ ప్రాంతీయుల ఎన్నో ఏళ్ల కల.. ఎట్టకేలకు స్వరాష్ట్రం వచ్చాక పాలనా సౌలభ్యానికి ప్రభుత్వం మెదక్‌ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటుచేసిన విషయం విదితమే. అందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఒక్క చోటే కొలువుదీరి పాలన సాగించేలా కార్యాలయ సౌధాలను అధునాతన సౌకర్యాలతో నిర్మించింది. వీటిని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనుండటం విశేషం. దీనికితోడు రాష్ట్రస్థాయి రెండు పథకాలకు మెదక్‌లో తెర తీయనున్నారు. ఈ నేపథ్యంలో వాటి విశేషాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

2016 అక్టోబరు 11న మెదక్‌ పట్టణ కేంద్రంగా 20 మండలాలతో జిల్లా ఏర్పాటైంది. ప్రస్తుతం మండలాల సంఖ్య 21కి చేరాయి. కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు ఈ రెండూ అద్దె భవనాల్లో కొనసాగుతూ వచ్చాయి. ఆయా కార్యాలయాలకు శాశ్వత నిర్మాణాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. సమీకృత కలెక్టరేట్‌, జిల్లా పోలీసు కార్యాలయాలకు 2018 మే 5న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. తిరిగి వాటి ప్రారంభోత్సవానికీ ఆయనే హాజరవుతుండడం విశేషం.

  • పాలనా సౌధమైన కలెక్టరేట్‌లోని కింది అంతస్తులో పాలనాధికారి, అదనపు పాలనాధికారులు (రెవెన్యూ, స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారులకు ప్రత్యేక ఛాంబర్లు.
  • కింది అంతస్తులో సమావేశం మందిరం, వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ ఉంటాయి. వీటికితోడు మూడు కాన్ఫరెన్స్‌ హాళ్లను సైతం నిర్మించారు. రెండు వెయింటింగ్‌ హాళ్లను ఏర్పాటుచేశారు.
  • మొత్తం 49 శాఖలు ఉండగా, అంతస్తుల వారీగా శాఖలకు విశాల గదులు కేటాయించారు. ఐదు శాఖలకు పట్టణంలో శాశ్వత భవనాలు ఉండగా అవి తప్ప మిగిలినవి కలెక్టరేట్‌లో కొలువుదీరనున్నాయి.
  • సమీపంలో పాలనాధికారి, అదనపు పాలనాధికారులకు బంగ్లాలు, 8 మంది జిల్లా అధికారుల నివాసానికి జీ+వన్‌ పద్ధతిలో భవనాలను నిర్మించారు. మెదక్‌-రామాయంపేట ప్రధాన రహదారికి పక్కన ఉన్న సమీకృత కలెక్టరేట్‌ భవనం, అధికారుల నివాసగృహాల వరకు సీసీ రహదారి, విభాగిని నిర్మించారు.
  • సముదాయం ఆవరణ పచ్చదనంతో కనువిందు చేస్తోంది. వాటర్‌ ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం ఎదురుగా ఎత్తయిన జాతీయ జెండా పతాకాన్ని ఏర్పాటు చేశారు.

రాజభవనం తరహాలో..

  • జిల్లా పోలీస్‌ కార్యాలయం మెదక్‌-రామాయంపేట రహదారిలో తూర్పుకు అభిముఖంగా నిర్మించడంతో కళ ఉట్టిపడుతోంది. రాజభవనం తరహాలో నిర్మాణం ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ప్రస్తుతానికి జిల్లా పోలీసు కార్యాలయాన్ని నిర్మించారు. ఎస్పీ నివాసగృహ సముదాయం, ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌, బ్యారక్‌ పనులు కొనసాగుతున్నాయి.
  • జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను ఇక్కడి నుంచి పర్యవేక్షించేలా కమాండ్‌ కంట్రోల్‌ కొలువుదీరింది. ప్రజలు తమ అర్జీలను ఇచ్చేందుకు విశాలమైన గ్రీవెన్స్‌హాల్‌ను నిర్మించారు. కార్పొరేట్‌ తరహాలో రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • కార్యాలయ ఆవరణలో పరేడ్‌ గ్రౌండ్‌ను తీర్చిదిద్దారు. పోలీస్‌ సిబ్బంది పరేడ్‌ నిర్వహణకు దీన్ని వినియోగిస్తారు. శాశ్వత హెలీప్యాడ్‌ నిర్మించారు.

చేయూత అందిస్తూ..

వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఆసరా పింఛన్‌ దివ్యాంగులు, వింతంతువులు, ఒంటరి మహిళలకు అందిస్తున్న విషయం విదితమే. ఆసరా పథకం ద్వారా దివ్యాంగులకు రూ.3,016 అందజేస్తుండగా, ఇటీవల సీఎం కేసీఆర్‌ దాన్ని రూ.4,016కు పెంచారు. లబ్ధిదారులందరికీ ఈ నెల నుంచి పెంచిన మేర ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని