logo

సమస్యలు అటుంచి..విధానాలే ముందుంచి!

శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు.

Published : 20 Apr 2024 01:52 IST

చేరికలు, పదవుల హామీపైనే పార్టీల దృష్టి

 

ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే, జహీరాబాద్‌: శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే లోకసభ స్థానం పరిధి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచార బాధ్యతలను ముఖ్య కార్యకర్తలకే అప్పగిస్తున్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు స్థానిక నాయకత్వమే పార్టీ విధానాలు, చేసిన పనులు, హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మండల, నియోజకవర్గ కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో ముఖ్యనేతలతో సభలు, రోడ్డుషోల ద్వారా ప్రచారం చేపట్టాలనే ఆలోచనలో పార్టీలున్నాయి. ఇందుకనుగుణంగానే ప్రచార అనుమతులు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.

 గతం కంటే భిన్నంగా..

గతంలో ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలనే ప్రచార అస్త్రాలుగా మలుచుకునేవారు. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా పార్టీల మేనిఫెస్టోల్లోని అంశాలు, అభ్యర్థుల వ్యక్తిగత అంశాలే ప్రధాన అంశాలుగా మారుతున్నాయి.

  •  జహీరాబాద్‌ నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలతో మౌలిక వసతుల కల్పన ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, అందోలు, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో సాగునీరు లేక అన్నదాతలు వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. గోదావరి జలాలు తరలించి నియోజకవర్గం పరిధిలోని రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామనే నాయకుల మాటలు హామీలుగా మారుతున్నాయి.
  •  ఆరుతడి పంటలు ఎక్కువగా పండించే జహీరాబాద్‌, అందోలు, నారాయణఖేడ్‌, జుక్కల్‌ నియోజకవర్గాల్లో ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ముందడుగు పడడం లేదు. గతంలో మూడు పార్టీలు పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధిపై హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు.
  •  కామారెడ్డి జిల్లాలోని మద్నూర్‌లో ప్రస్తుత ఎంపీ బీబీపాటిల్‌ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటవుతుందని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. నాలుగేళ్ల నుంచి ప్రచారం చేసినా విద్యాసంస్థ ఏర్పాటు కాలేదు.
  •  కామారెడ్డి జిల్లాకేంద్రంలో ఆర్వోబీ(రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు)లు లేక పాతపట్టణం నుంచి కొత్త పట్టణానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరగంటకోసారి రైల్వే గేటు పడుతుండడం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఆర్వోబీల నిర్మాణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాల్సి ఉంటుంది. ఎంపీ చొరవతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
  •  కరీంనగర్‌-కామారెడ్డి-ఎల్లారెడ్డి- పిట్లం(కేకేవై) రహదారిని జాతీయ రహదారిగా మార్చే దస్త్రం కేంద్రంలో నాలుగేళ్ల నుంచి పెండింగ్‌లోనే ఉంది. లోకసభ స్థానం పరిధిలో పలు రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు లభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వలసలను ప్రోత్సహిస్తున్న అభ్యర్థులురానున్న రోజుల్లో రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు జనసమీకరణలో ముఖ్యకార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలే కీలకంగా ఉండనున్నారు. గ్రామాల్లో అభ్యర్థుల తరఫున ఓటు అడిగే బాధ్యత వీరే తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో పల్లెలు, పట్టణాల్లో ప్రజాబలం ఉన్న నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఇతర పార్టీల క్రియాశీల కార్యకర్తలను తమ పార్టీల్లో చేర్చుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.

స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యమిస్తామంటూ..

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేసిన నాయకులకు రానున్న స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల టికెట్లు కేటాయింపులో ప్రాధాన్యమిస్తామని మూడు ప్రధాన పార్టీలు హామీనిస్తున్నాయి. నియోజకవర్గ, మండల స్థాయి నేతలకు నియామక పదవులు వచ్చేలా కృషి చేస్తామని అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. కేంద్రంలో మూడోసారి అధికారం చేపడతామని చెబుతున్న భాజపా నేతలు సైతం కేంద్ర ప్రభుత్వ నియామక పదవులు ఇస్తామని నమ్మకం కలిగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని