logo

ఓటున్న ప్రవాసీ.. పెరగాలి చైతన్య దీప్తి

వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది.

Published : 24 Apr 2024 02:42 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట: వజ్రాయుధంతో సమానమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటేనే సార్థకత. ప్రజాస్వామ్య పరిరక్షణకు బాటలు వేసే ఎన్నికల క్రతువులో దేశ భవితను ‘ఓటు’ నిర్దేశిస్తుంది. ఈ తరుణంలో ఓటరు తన బాధ్యతను పక్కాగా నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలంటూ ఎన్నికల సంఘం వివిధ స్థాయిల్లో ప్రేరణ కల్పిస్తోంది. ఎన్నికల్లో ఎన్నారైల (ప్రవాసుల) నుంచి ఆశించిన స్పందన కనిపించడం లేదు. జిల్లాకు సంబంధించి ఎన్నారైలు కేవలం 27 మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. అందులో పురుషులు - 24, మహిళలు - 3 మంది మాత్రమే. ఫిబ్రవరి 8న వెలువరించిన ఓటరు జాబితా ప్రకారం నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. హుస్నాబాద్‌ నుంచి 13 మంది, సిద్దిపేట - 5, దుబ్బాక - 6, గజ్వేల్‌ - 3 ఉన్నారు. వారు సైతం పూర్తిస్థాయిలో వినియోగించుకుంటారా.. లేదా.. అనేది ప్రశ్నార్థకం. ఓటు సద్వినియోగం పక్కన పెడితే.. కనీసం నమోదు సంఖ్య జిల్లాలో మూడంకెలను దాటడం లేదు.

విదేశాల్లో 9 వేల మంది: జిల్లాలో ఓటర్ల సంఖ్య 9,61,361 మంది. ఇక్కడే పుట్టిపెరిగి.. చదువుకుని ఎంతో మంది ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అలాంటి ప్రవాసీయులకు.. ఓటరుగా నమోదయ్యే అవకాశం ఉంది. పోలింగ్‌ రోజున నేరుగా పాల్గొని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవచ్చు. ఎన్నికల సంఘం ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం (ఫారం -6ఏ దరఖాస్తు) కల్పించినా.. పెద్దగా ముందుకు రావడం లేదు. మరోవైపు జిల్లాకు చెందిన సుమారు 9 వేల మంది గల్ఫ్‌ దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, కెనడా, జర్మనీ, యూకే, ఇతరత్రా దేశాల్లో నివసిస్తున్నారు. విద్యార్థులు సహా ఐటీ, ఇతర రంగాల్లో ఉద్యోగులు, వివిధ చోట్ల కార్మికులుగా పని చేస్తున్నారు. సహజంగా ఆరు నెలలు స్థానికంగా ఉండకపోతే ఎన్నికల సంఘం జాబితా నుంచి ఓటు హక్కును తొలగిస్తుంది. ఇతర దేశాలకు వెళితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు పలు దశల్లో అవకాశం కల్పించింది. అయినా అతి తక్కువ మంది ముందుకు రావడం గమనార్హం.

 అవకాశం కల్పిస్తే మేలు: ప్రవాసులు ఓటు వేయాలంటే స్వదేశానికి రావాల్సి ఉంటుంది. కార్మికులు, కూలీ పనుల నిమిత్తం వెళ్లిన వారు.. ఇక్కడికి రాలేని పరిస్థితి. మరోవైపు పని చేస్తున్న చోట అనుమతి తీసుకోవడం కష్టమే. పోలింగ్‌ రోజు వచ్చి ఓటేయడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని భావించి ఆసక్తి చూపడం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా ఓటేసే అవకాశం కల్పించాలని గతంలో ఎన్నికల సంఘం యోచించినా కార్యరూపం దాల్చ లేదు. పొరపాట్లు జరిగితే ఎన్నికల ప్రక్రియపై ప్రభావం పడుతుందన్న కారణంతో ఈసీ వెనక్కి తగ్గింది. కనీసం ఓటరుగా నమోదు చేసుకుంటే ఎంత మంది ఎన్నారైలు ఉన్నారనే లెక్క పక్కాగా తేలేదని మరికొందరి అభిప్రాయం. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని అంతా ఓటు వేసేలా పకడ్బందీ వ్యవస్థను రూపకల్పన చేయాల్సి ఉంది. మన దేశ ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల ప్రక్రియలో తామూ పాల్గొన్నామనే తృప్తి మిగులుతుంది. దేశ, రాష్ట్ర రాజకీయాలను తెలుసుకోవడంలో మాత్రం ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని