logo

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిప్పిస్తానంటూ రూ. 8 లక్షలు వసూలు

బ్యాక్‌ డోర్‌ ఎంట్రీల రూపంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిప్పిస్తాంటూ బీటెక్‌ విద్యార్థులకు గాలం వేసి రూ.లక్షలు వసూలు చేసిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

Published : 09 Feb 2023 03:22 IST

నిందితుల్లో ఒకరి అరెస్టు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: బ్యాక్‌ డోర్‌ ఎంట్రీల రూపంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలిప్పిస్తాంటూ బీటెక్‌ విద్యార్థులకు గాలం వేసి రూ.లక్షలు వసూలు చేసిన నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన సాయికృష్ణ(25) హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్వర్‌రావు అనే వ్యక్తులు కరీంనగర్‌లోని వాగేశ్వరి బీటెక్‌ కళాశాల విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌నకు విప్రోలో ఉద్యోగాలున్నాయంటూ సందేశం పంపారు. అమీర్‌పేటలో పలు సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులనూ వాట్సాప్‌ ద్వారా సంప్రదించారు. దీంతో విద్యార్థులు ఉద్యోగాల కోసం సాయికృష్ణను ఆశ్రయించారు.  35 మంది విద్యార్థుల నుంచి సుమారు రూ.8 లక్షల వరకు నిందితులు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.25వేల నుంచి రూ.60 వేల వరకు వెంకటేశ్వర్‌రావు ఫోన్‌కు గూగుల్‌పే, ఫోన్‌పే చేయించుకున్నారు. తరువాత విప్రో సంస్థలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనుమానం వచ్చిన పలువురు విద్యార్థులు నియామక పత్రాలను ఆన్‌లైన్‌లో పరీక్షించగా అవి నకిలీవని తేలింది. మోసపోయామని గ్రహించిన విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు. అమీర్‌పేటలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్న కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థిని ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్‌ పోలీసులు నిందితుడు సాయికృష్ణను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వెంకటేశ్వర్‌రావు కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని