logo

ఫ్లోరైడ్‌పై పోరు.. నామినేషన్ల జోరు

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్‌ నీటి సమస్య, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వడం, బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందించాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికలను వేదికగా చేసుకుంది జల సాధన సమితి.

Updated : 05 Nov 2023 05:39 IST

1996 లోక్‌సభ ఎన్నికల్లో 537 నామపత్రాలు దాఖలు

ఓ గ్రామంలో వార్తపత్రిక పరిమాణంలోని నమూనా బ్యాలెట్‌తో నిర్వహిస్తున్న ప్రచారం (పాతచిత్రం)

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను పీడిస్తున్న ఫ్లోరైడ్‌ నీటి సమస్య, ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పూర్తి చేసి ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు తాగునీరు ఇవ్వడం, బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందించాలనే డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికలను వేదికగా చేసుకుంది జల సాధన సమితి. ఫ్లోరైడ్‌ బాధితులు, రైతులను, ఉద్యమ కార్యకర్తలను సమీకరించి 1996లో నిర్వహించిన నల్గొండ లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయించింది. ఈ ఎన్నికలో 537 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో  నామినేషన్లు ఉపసంహరించుకున్నవారు, నామినేషన్లు తిరస్కరణకు గురైనవారు 57 మంది ఉన్నారు. నామపత్రాల  పరిశీలన అనంతరం 480 మంది బరిలో మిగిలారు. ఇందులో 386 మంది షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభ్యర్థులున్నారు. వీరిలో 60 మంది మహిళలు పోటీలో నిలవడం విశేషం. 480 మందిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆరుగురు మాత్రమే ఉన్నారు. అసాధారణంగా అభ్యర్థులు బరిలో నిలవడంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి నెల రోజుల పాటు ఈ నియోజకవర్గంలో ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 480 గుర్తులతో ఒక పుస్తకం ఆకారంలో బ్యాలెట్‌ పత్రం రూపొందించారు. బ్యాలెట్‌ పెట్టెలు ప్రత్యేకంగా భారీ ఆకారంలో తయారు చేయించారు. 1996 మే 27న ఎన్నికలు నిర్వహించారు. నల్గొండ లోక్‌సభకు నిర్వహించిన ఈ ఎన్నిక జాతీయ స్థాయిలో చర్చకు, సంస్కరణలకు దారి తీసింది.

ధర్మబిక్షం

71,757 ఓట్ల ఆధిక్యంతో ధర్మభిక్షం విజయం

నల్గొండ లోక్‌సభ ఎన్నికలో 1996లో మొత్తం ఓటర్ల సంఖ్య 14,27,026. ఇందులో 8,51,118 మంది (59.8 శాతం) ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక బ్యాలెట్‌ పత్రాలన్నీ లెక్కించేందుకు రెండు రోజులు పట్టింది. 480 మంది అభ్యర్థులున్న బ్యాలెట్‌ పత్రంలో 313 వరుస సంఖ్యలో సీపీఐ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షంకు కంకి, కొడవలి గుర్తు కేటాయించారు. ఆ గుర్తుపై 2,77,336 ఓట్లు పోలయ్యాయి. భాజపా అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డికి 2,05,579, కాంగ్రెస్‌ అభ్యర్థి తిరునగరు గంగాధర్‌కు 1,99,282, ఎన్టీఆర్‌ తెదేపా అభ్యర్థి వెన్‌రెడ్డి నరేందర్‌రెడ్డికి 22,994 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో ఆరో వంతు రాకపోవడంతో 477 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

నామినేషన్‌కు డిపాజిట్‌ పెంపు

1996, అంతకు మందు లోక్‌సభకు పోటీ చేయడానికి డిపాజిట్‌గా సాధారణ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250, శాసనసభ సభ్యుడిగా పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి వచ్చేది. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు 1996లో నల్గొండ లోక్‌సభ స్థానానికి, కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం, తూర్పు దిల్లీ శాసనసభ స్థానాలకు అసాధారణంగా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల కమిషన్‌ దీనిపై చర్చించి సంస్కరణలు తెచ్చింది. తర్వాతి ఎన్నికల్లో నామినేషన్‌ రుసుమును లోక్‌సభకు జనరల్‌ అభ్యర్థులకు రూ.500 నుంచి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.12,500, శాసనసభకు జనరల్‌ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.10వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 నుంచి రూ.5000కు పెంచింది. ఇప్పటికీ దేశమంతటా అభ్యర్థులు నాడు పెంచిన మొత్తంలో డిపాజిట్‌ను చెల్లించాల్సి వస్తుంది.

1996 ఎన్నికలో ఉపయోగించిన బ్యాలెట్‌ పత్రం, బ్యాలెట్‌ పెట్టె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని