logo

పంట అవశేషాలు కలియదున్నితే మేలు

పంట అవశేషాలు భూమిలో కలియదున్నితే కలిగే ప్రయోజనాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. పంట వ్యర్థాలు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి నేలకు పోషకాలు అందించే విధానాన్ని క్షేత్ర ప్రదర్శన ద్వారా చూపారు. రుద్రూర్‌ వరి-చెరకు ప్రాంతీయ పరిశోధన స్థానం దత్తత

Published : 05 Dec 2021 05:33 IST


నేలలో పోషకాలు పెంచే విధానాన్ని వివరిస్తున్న శాస్త్రవేత్తలు

కోటగిరి(రుద్రూర్‌), న్యూస్‌టుడే: పంట అవశేషాలు భూమిలో కలియదున్నితే కలిగే ప్రయోజనాలను శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. పంట వ్యర్థాలు కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి నేలకు పోషకాలు అందించే విధానాన్ని క్షేత్ర ప్రదర్శన ద్వారా చూపారు. రుద్రూర్‌ వరి-చెరకు ప్రాంతీయ పరిశోధన స్థానం దత్తత గ్రామమైన కోటగిరి మండలం హెగ్డోలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ నేల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆహార విజ్ఞాన శాస్త్ర సాంకేతిక కళాశాలతో కలిసి ప్రదర్శనలు నిర్వహించారు.

సాధారణంగా పంట వ్యర్థాలు కలియదున్నితే ఎరువుగా మారడానికి మూడు నెలలు పడుతుందన్నారు. 30-40 రోజుల్లో సేంద్రియ ఎరువుగా మార్చుకొని వినియోగించే విధానం ఉందని చెప్పారు. పంట అవశేషాలపై చల్లే మూడు రకాల ద్రావణాన్ని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైజోబియం బ్యాక్టీరియతో శుద్ధి ప్రక్రియను చేసి చూపించారు. రైతులకు క్విజ్‌ పోటీ నిర్వహించి బహుమతులు అందించారు. ప్రధాన శాస్త్రవేత్త డా.బాలాజీ నాయక్‌, సేద్య శాస్త్రవేత్త ఫిర్దోస్‌ సహానా, కీటక శాస్త్రవేత్త సాయిచరణ్‌, రమ్య రాథోడ్‌, సౌందర్య పాల్గొన్నారు.

ఖర్చు తగ్గించి దిగుబడులు పెంచాలి

బోధన్‌ గ్రామీణం : మిరపసాగులో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడుతూ దిగుబడులు పెంచేందుకు కృషిచేయాలని రుద్రూర్‌ కృషివిజ్ఞాన కేంద్ర అధిపతి నవీన్‌కుమార్‌ సాగుదారులకు సూచించారు. బోధన్‌ మండలం మావందిఖుర్దులో శనివారం మిరప పంటను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. మిరపలో ప్రస్తుతం గులాబీ పురుగు ఆశించిందని దాని నివారణకు తగిన సూచనలు, సలహాలు అందించారు. అంతకుముందు జాడిజమాల్‌పూర్‌లో ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఏడీఏ సంతోష్‌, ఉద్యాన అధికారి పండరి, రాజేశ్వర్‌, నర్సయ్య, వెంకట్‌రెడ్డి, పలువురు కేవీకే శాస్త్రవేత్తలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని