logo

చెత్తకో లెక్కుంది..

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధనలు పాటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

Published : 09 Dec 2022 05:09 IST

నూతన విధానంలో సేకరణకు కార్యాచరణ
త్వరలో దుకాణాలకు జియోట్యాగింగ్‌
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

కామారెడ్డి పట్టణంలో ప్రధాన వాణిజ్య ప్రాంతం సుభాశ్‌రోడ్డు

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ- 2016 నిబంధనలు పాటించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇంటింటి నుంచి సేకరించే చెత్తతో పాటు దుకాణాల ద్వారా ఉత్పత్తవుతున్న వ్యర్థాలకు పక్కాగా లెక్క ఉండేలా చర్యలు చేపడుతోంది. వీటి పరిమాణం ఆధారంగా వాణిజ్య కేంద్రాల నుంచి రుసుం వసూలు చేయనున్నారు.

ప్రధాన రహదారులపై ఉన్నవాటిని..

పురపాలికల్లోని వాణిజ్య ప్రాంతాల్లో చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ప్రతి దుకాణాన్ని జియోట్యాగింగ్‌ చేసే దిశగా యంత్రాంగం అడుగులు వేస్తోంది. క్యూఆర్‌ కోడ్‌తో కూడిన సంఖ్యను కేటాయించి స్థానికత ఆధారంగా మ్యాపింగ్‌ చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు, దుకాణాలు, ఆసుపత్రులు, సూపర్‌మార్కెట్లు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, మాంస విక్రయ దుకాణాలను జియోట్యాగింగ్‌ చేయాలని నిర్ణయించారు. ఏయే దుకాణానికి ఎంత చెత్త వస్తోంది.. వాటికి ఎంత రుసుం వసూలు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఎరువు తయారీ

బల్దియాల్లో ఉత్పత్తవుతున్న తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేయాలని నిర్ణయించారు. వర్మికంపోస్టు ప్లాంటులో రైతులకు అవసరమైన ఎరువును తయారు చేసి ఆదాయం రాబట్టాలని భావిస్తున్నారు. ఇళ్ల ద్వారా వెలువడుతున్న చెత్తను వేర్వేరు డబ్బాల్లో సేకరించి డంపింగ్‌యార్డుకు తరలించనున్నారు.

స్వచ్ఛత దిశగా అడుగులు

జిల్లాలో మూడు బల్దియాలు స్వచ్ఛసర్వేక్షణ్‌- 2023లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారుల వెంబడి చెత్త పడేయకుండా సిబ్బంది కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి భారీగా జరిమానాలు విధించనున్నారు. దుకాణాల నుంచి చెత్త సేకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నారు.


మార్పునకు ప్రయత్నం
- దేవేందర్‌, కమిషనర్‌

పట్టణాల్లో చెత్త ఉత్పత్తి, సేకరణపై పర్యవేక్షణ అవసరం. ఎవరికివారు ఇళ్లలో చెత్త ఉత్పత్తిపై స్వీయ నియంత్రణ పాటించాలి. దుకాణాల వద్ద చెత్త సేకరణకు నూతన విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. స్వచ్ఛత దిశగా ప్రజలు అడుగులు వేయాలి. బల్దియా సిబ్బందికి తోడ్పాటునందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని