logo

ప్రాణం కాపాడేది.. ఆహార ప్రమాణాలే

ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు అధ్యయనాలతో వెల్లడించిన వాస్తవాలు ఇవి. కల్తీ, నాణ్యత లోపించిన, హానికర మిశ్రమాలతో అసురక్షితంగా మారుతున్న ఆహార పదార్థాల చలామణిని నియంత్రించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి.

Updated : 07 Jun 2023 06:18 IST

నేడు సురక్షిత ఆహార దినోత్సవం

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు అధ్యయనాలతో వెల్లడించిన వాస్తవాలు ఇవి. కల్తీ, నాణ్యత లోపించిన, హానికర మిశ్రమాలతో అసురక్షితంగా మారుతున్న ఆహార పదార్థాల చలామణిని నియంత్రించడంలో వ్యవస్థలు విఫలమవుతున్నాయి.

ప్రజలకు సురక్షిత ఆహారం లభించేలా చేయడం కోసం అందరిలో చైతన్యం నింపడానికి ఏటా ప్రపంచ ఆరోగ్య, ఆహార, వ్యవసాయ సంస్థలు ఏటా జూన్‌ 7న సురక్షిత ఆహార దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంలో నాణ్యమైన ఆహారం అందించడానికి ఆయా సంస్థల్లో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. ఎవరెవరు ఎలా పాత్రులో పరిశీలిద్దాం..

నిర్ధారణ

ఇది ప్రభుత్వ యంత్రాంగం విధి. ఈ బాధ్యతగల శాఖల అధికారులు నిత్యం తనిఖీలతో ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రత వంటివి పరిశీలించాలి. నిర్దేశిత ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం నిజామాబాద్‌ ఆహార తనిఖీ అధికారి ఇతర జిల్లాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఏకకాలంలో బహుళ జిల్లాలకు ప్రాతినిధ్యం వహించడం, శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వెరసి నాణ్యత గాలిలో దీపంలా మారింది. నెలకు కనీసం 72 రకాల నమూనాలు సేకరించి పరీక్షించాల్సి ఉండగా.. సిబ్బంది కొరతతో తనిఖీలకు దిక్కులేదనే విమర్శలున్నాయి. ఈ వ్యవస్థను ప్రభుత్వం పటిష్ఠపరచాల్సిన అవసరముంది.

నిల్వ

సరకును ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరవేసే వ్యాపారులు.. నిర్దేశిత ప్రమాణాలకు లోబడి నిల్వ, ప్యాకింగ్‌, శుద్ధి చేయాలి. ఇప్పుడు తక్కువ సరకుతో ఎక్కువ లాభాలు గడించాలనే ఉద్దేశంతో ఆహార వస్తువులు కల్తీ చేస్తున్నారు. నూనె, ఎరువు ఉపయోగించి పాల తయారీ, పిండి, కారంపొడి, టీ పౌడర్‌లో ఇతర హానికర వస్తువులు కలుపుతున్నారు. వీటికివిధానాలకు స్వస్తి పలకాలి. వ్యాపారంలో నైతిక విలువలు పాటించాలి.

తెలుసుకోవాలి

తేనె, పాల వంటి ఉత్పత్తుల్లో కల్తీని సులువుగా తెలుసుకోవచ్చని గ్రామీణ ప్రాంతాల్లో వాటిని అనుసరిస్తుంటారు. ఆయా విధానాలపై అవగాహన పెంచుకోవడం వినియోగదారుల కర్తవ్యం. కల్తీని గుర్తిస్తే ఫిర్యాదు చేసి నియంత్రణ వ్యవస్థలకు బాసటగా నిలబడాలి.

సమాజం సంఘటితం

సురక్షిత ఆహార సరఫరా గొలుసులో మంచి విధానాల కోసం సమాజం సంఘటితమవ్వాలి. అందుకు ఆయా సంఘాలుగా ఏర్పడి కల్తీలేని నాణ్యమైన ఆహారోత్పత్తులు ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలి.

సాగు

ఆహార ఉత్పత్తిదారులు సాగులో సురక్షిత విధానాలు అనుసరించాలి. అందుకు సేంద్రియ సాగు శ్రేయస్కరం. దిగుబడుల పెరుగుదలకు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడి వినియోగం ఇప్పుడు ఆహార, ఆరోగ్య భద్రతను ప్రమాదంలో పడేసింది. ఆహారోత్పత్తుల్లో విషపూరిత అవశేషాలు ఉంటున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భూమిలోనూ పరిమితికి మించి భాస్వరం ఉందని నిజామాబాద్‌ మట్టి నమూనాలు పరిశీలించిన నిపుణులు తేల్చారు

16 లక్షలు సగటున రోజుకు ప్రపంచంలో సురక్షితం కాని ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నారు.

340 ఆహార జనిత వ్యాధులకు ఒక్కరోజులో బలవుతున్న అయిదేళ్లలోపు చిన్నారుల సంఖ్య.

200 డయేరియా నుంచి క్యాన్సర్‌ వరకు నాణ్యత లోపించిన ఆహారంతో వ్యాపిస్తున్న వ్యాధులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని